Posani Krishna Murali: సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు. తన జీవితాంతం రాజకీయాల జోలికి వెళ్లనని అన్నారు. ఇన్నేళ్ల జీవితంలో తాను ఎవరికీ తల వంచలేదని ఆడవాళ్లనే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నన్ను తిట్టరా అని ఆవేదన వ్యక్తం చేశారు. అవేవీ తాను పట్టించుకోనని చెప్పారు. తనను అందరికంటే ఎక్కువగా పొగిడింది చంద్రబాబే అని అన్నారు. చంద్రబాబును ఎంతో గౌరవించానని అన్నారు.
ఆయన చేసేవి చాలా మంచి పనులు అని ఓ లిస్టు కూడా రాసుకున్నానని తెలిపారు. ఆయన పొరపాట్లు చేసినప్పుడు విమర్శలు చేశానని అన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు తనను ఆదరించారని కానీ ఈ రోజు నుండి తాను చనిపోయేవరకు తన కుటుంబం కోసమే మాట్లాడతానని స్పష్టం చేశారు. ఏ రాజకీయ నాయకుని గురించి మాట్లాడనని చెప్పారు.
తనకు మోడీ అంటే చాలా ఇష్టమని అవసరమైతే ఆయనను పొగుడుతానని అన్నారు. వైఎస్ జగన్ అంటే తనకు చచ్చేంత అభిమానం అని ఆయన తనకు ఎంతో గౌరవం ఇచ్చారని అన్నారు. అయినప్పటికీ ఇకపై జగన్ గురించి కానీ చంద్రబాబు గురించి కూడా మాట్లాడనని తెలిపారు. తాను ఎప్పుడూ డబ్బులు తీసుకుని రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేయలేదని అన్నారు. తన కొడుకు రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరాడని అందుకే తప్పుకుంటున్నానని చెప్పారు. కేసుల భయంతో రాజకీయాలకు దూరం అవ్వడంలేదని స్పష్టం చేశారు.
తాను ఏ తప్పు చేయలేదని ఒకవేళ చేసి ఉంటే జైలుకు వెళ్లడానికి అయినా సిద్ధమని అన్నారు. తాను ఎవరినీ తిట్టలేదని తనను తిట్టినవారినే అన్నానని చెప్పారు. ప్రశ్నించినందుకే తన కుటుంబాన్ని దారుణంగా తిట్టారని వాళ్ల గురించి మాత్రమే మాట్లాడానని తెలిపారు. లోకేష్ తన నిజాయితీ చూసి ఇష్టపడ్డారని అన్నారు. పార్టీలోకి వెళితే పదవులు కూడా ఇచ్చేవారని, తనకు కరోనా ఇచ్చినప్పుడు కూడా లోకేష్ ఆరా తీశారని తెలిపారు. సర్టిఫికెట్ వాళ్లే ఇచ్చారని డెత్ సర్టిఫికెట్ కూడా వాళ్లే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.