Pushpa – AP Politics: పుష్ప 1 సినిమాలో షెకావత్ పాత్రధారి.. పుష్పతో ఒకటి తగ్గింది పుష్పా అంటూ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పనవసరం లేదు. అదే డైలాగ్ ఇప్పుడు ఏపీలోని ఆ జిల్లాలో గల పొలిటికల్ లీడర్స్ నోట తెగ వినిపిస్తోంది. అదేదో అధికార పార్టీ నేతల వరకే ఆగలేదు.. ప్రతిపక్ష పార్టీ నేతలకు కూడ పాకింది. అందుకే ఈ జిల్లాలో ఆ ఒకటి ఏమిటన్నది ఇప్పుడు వైరల్ గా మారింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మేల్యే మాత్రం.. ఆ ఒకటి ఏమి తగ్గిందో త్వరలోనే చెబుతానంటూ కార్యకర్తలను ఆలోచనలో పడేశారు. ఇంతకు ఆ ఒకటి తగ్గిన జిల్లా.. అమరజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లానేనట.
ఇటీవల నెల్లూరు నగర కార్పొరేషన్ లో ప్రజా విజ్ఞప్తుల దినం సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజల గృహాలను ధ్వంసం చేయడాన్ని తాను సహించనని, తాను ఎప్పటికీ పేదల పక్షాన ఉంటానంటూ తేల్చి చెప్పారు ఎమ్మెల్యే. అయితే ఈ సమావేశం అనంతరం బయటకు వచ్చిన ఎమ్మేల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఒకటి తగ్గిందంటూ పదేపదే ప్రస్తావించారు. ఆ ఒక్కటి ఏమిటని మీడియా ప్రతినిధులు అడగగా, సమయం వచ్చినప్పుడు తానే చెబుతానంటూ సుమారు పదిసార్లు ఒకటి తగ్గింది పుష్పా అంటూ కామెంట్ చేశారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలా కామెంట్ చేశారో లేదో మరుసటి రోజు వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం బాలాజీ నగర్ లో వైసీపీ నేత ఇంటిని కూల్చి వేయడంపై మీడియాతో మాట్లాడారు. అక్కడ కూడా కాకాని మీడియాతో మాట్లాడుతూ.. ఒకటి తగ్గిందని పదేపదే చెప్పుకొచ్చారు. గృహాలను కూల్చి వేస్తున్న అధికారులు ప్రభుత్వాలు మారుతాయన్న విషయాన్ని గ్రహించాలని కూడా కాకాని అన్నారు.
Also Read: BigTV Exclusive: ఉగ్రవాదులతో సంబంధం లేదు మహాప్రభో.. ‘బిగ్’ టీవీతో జకారియా
ఒకవైపు అధికార పక్ష ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఒకటి తగ్గిందని కామెంట్ చేయగా, మరుసటి రోజే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం అదే రీతిలో ఒకటి తగ్గిందంటూ కామెంట్ చేయడం విశేషం. పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ఇంతకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఆ తగ్గిన ఒకటి ఏమిటని టీడీపీ క్యాడర్ చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఇక మునుముందు ఆ ఒక్కటి గురించి ఎమ్మెల్యే ఏమి చెబుతారోనన్న ప్రశ్నలు టీడీపీ నాయకత్వంలో సైతం మెదులుతున్నాయి.