PVN Madhav: విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాంతీయ కార్యాలయం వేదికగా రేపటి నుండి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ‘మ్యాంగో మేళా’ పోస్టర్‌ను బీజేపీ రాష్ట్ర నేత పి.వి.ఎన్. మాధవ్ ఇతర ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
కూటమిపై మైండ్ గేమ్స్..
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. జనసేన-బీజేపీ బంధంపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక విశ్లేషకుడు తన మాటలను వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. కొందరు కావాలనే మైండ్ గేమ్స్ ఆడుతూ కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, ఇలాంటి ముసుగు వీరులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తుల ప్రయత్నాలు సాగవన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా తప్పు చేసిన వారెవరైనా పాపాలకు పరిహారం చెల్లించుకోక తప్పదని, రాబోయే రోజుల్లో అరెస్టులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.
ఎన్నికలు – భవిష్యత్తు కార్యాచరణ
గత ఎన్నికల్లో వలసదారులు లేకపోవడం వల్లే పోలింగ్ సజావుగా సాగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్న దేశ వ్యతిరేక శక్తులను ప్రజలు గుర్తించారని, ఓటు హక్కు విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ‘SIR’ లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
నెల రోజుల పాటు ప్రజా కార్యక్రమాలు
కేంద్రంలో మోడీ నేతృత్వంలోని 12 ఏళ్ల సుపరిపాలనను, అలాగే రాష్ట్రంలో కూటమి సాధించిన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని మాధవ్ ప్రకటించారు. ఇందులో భాగంగా జూన్ 1 నుండి 30 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పర్యావరణ దినోత్సవం, ప్రకృతి వ్యవసాయం ప్రమోషన్, యోగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలు ఉంటాయన్నారు.
ఏపీ అభివృద్ధి – పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పోలవరం ప్రాజెక్టు పనులను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ. 15 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా ఏపీ పారిశ్రామికంగా మరింత బలోపేతం కానుందని మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: కూటమి ప్రభుత్వం, బీటెక్ రవిపై వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్.. సమాధానం చెప్పలేకే ‘గొడ్డలి రాజకీయం’!