Ramachandrapuram Case: ఆ కసాయి తండ్రి దొరికాడు. ఇద్దరు పిల్లలను కాలువలో పడేసి పారిపోయిన కిరాతకుడు పోలీసుల ముందు అసలు నిజాలు చెప్పేశాడు. 3 రోజుల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన కేసు కొలిక్కి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అయ్యో పాపం అని తల్లడిల్లిన ఉదంతం ముగింపునకు చేరింది. పోలీసుల విచారణలో ఆ కసాయి తండ్రి అసలు జరిగిందేంటో.. పిల్లల్ని ఎందుకు చంపాలనుకున్నాడో.. ఎందుకు అతను పారిపోయాడో మొత్తం వివరించాడు.
అసలేం జరిగిందంటే..
కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు వ్యాపారంలో అప్పుల పాలయ్యాడు. సుమారు 2 కోట్ల వరకు లాస్ అయ్యాడు. పొలం ఉన్నా.. అది అమ్మితే 20 లక్షలు కూడా రావు. చేసేది లేక.. అప్పులు తీర్చలేక.. కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుందామంటూ భార్యతో చర్చ పెట్టాడు. ఉలిక్కిపడిన భార్య.. భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. సూసైడ్‌కు భార్య ఒప్పుకోవడం లేదని గ్రహించి.. పిల్లి రాజు ఓ పాపిస్ఠి పని చేశాడు. మార్చి 17న తన ఇద్దరు పిల్లలు చదువుతున్న స్కూల్‌కు వెళ్లి వారిని తనతో స్కూటీ మీద తీసుకెళ్లాడు. నెలపర్తిపాడు శివారు కాలువ గట్టు దగ్గరకు తీసుకెళ్లి.. ఇద్దరు పిల్లలను అందులో తోసేసి.. అతను అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కాలువలో మునిగి ఏడేళ్ల కూతురు కారుణ్యశ్రీ చనిపోయింది. పదేళ్ల వయస్సున్న కుమారుడు రామసందీప్ మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు నిలుపుకున్నాడు. ఈ ఘటన తెలుగు స్టేట్స్‌లో తీవ్ర విషాదం నింపింది.
మూడు రోజుల పాటు ముప్పు తిప్పలు..
పిల్లల్ని కాలువలో పడేసి పరార్ అయిన తండ్రి ఎక్కడ? కూతురును చంపేసిన ఆ దుర్మార్గుడి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రెండు రోజుల పాటు పోలీస్ సెర్చింగ్ కొనసాగింది. యానాం బ్రిడ్జిపై రాజు స్కూటర్ కనిపించింది. యానాం దగ్గర గోదారిలో దూకి చనిపోయాడా? అనే అనుమానం తలెత్తింది. పోలీసులు ఫిషింగ్ బోట్లతో గోదావరిలో వెతికారు. గజ ఈతగాళ్లతో నదిలో గాలించారు. అయినా, అతడి ఆచూకీ దొరకలేదు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకే బ్రిడ్జీపై బండి వదిలేసి పారిపోయాడని డిసైడ్ అయ్యారు. ప్రత్యేక బృందాలతో మరింత పకడ్బందీగా గాలింపు చేపట్టారు. ఇక తప్పించుకోలేనని గుర్తించి.. ఆ కసాయి తండ్రి పిల్లి రాజు బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యాడు. ఎంక్వైరీలో జరిగిన విషయమంతా చెప్పాడు.
పోలీసులు చెప్పిన అసలు నిజాలు
అప్పుల బాధ తట్టుకోలేక పిల్లలతో సహా సూసైడ్ చేసుకోవాలని నిందితుడు పిల్లి రాజు భావించాడని డీఎస్పీ రఘువీర్ చెప్పారు. మొదట పిల్లలను కాలువలోకి తోసేశాడు. అయితే, తాను కూడా కాలువలో దూకడానికి ధైర్యం చాలకపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. యానాంలోని బంధువుల ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. కాలువ వద్ద రాజు స్కూటీని గుర్తించి దర్యాప్తు చేపట్టామన్నారు. మండపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడని తెలిసి రాజును అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు కోట్ల వరకు అప్పు ఉండటంతో ఆత్మహత్య యత్నం చేసినట్లు చెప్పారు డీఎస్పీ రఘువీర్.
మాయమై పోతున్నడమ్మా.. మనిషన్న వాడు..
మనుషుల్లో మానవత్వం నశిస్తోంది అనడానికి పిల్లి రాజు ఉదంతం మరో నిదర్శనం. అతనికి అప్పులు అయ్యాయి. అవి తీర్చలేక పోయాడు. చనిపోదాం అనుకున్నాడు. ఆత్మహత్య అనేది పరిష్కారం కాకపోయినా.. ఆ పనేదో అతనొక్కడే చేసుండొచ్చు కదా? పిల్లలేం పాపం చేశారు? వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? కాలువలో దూకేందుకు అతనే అంత భయపడి పారిపోతే.. అప్పటికే కాలువలో పడేసిన ఆ పిల్లలు ఇంకెంతం నరకం చూసి ఉంటారు? ఉన్మాదం కాకపోతే ఇదేంటి? అభంశుభం తెలీని ఆ పాప ఇప్పుడు ప్రాణాలతో లేదు. అతనికి జైలు శిక్ష తప్పదు. మరిప్పుడు వారి కుటుంబ పరిస్థితి ఏంటి? భార్య, కొడుకు ఎలా బతుకుతారు? పిల్లి రాజు చేసిన తప్పు మామూలుది కాదు. కఠిన శిక్ష పడినా.. ఈ పాపం శాపమై అతన్ని వెంటాడుతూనే ఉంటుంది.