Republic Day 2025: ఏపీలోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవాల్లో శకటాల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. వివిధ శాఖలకు సంబంధించిన శకటాలను రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించారు. వచ్చిన వారంతా వాటిని ఆసక్తిగా తిలకించారు..
రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసినట్లు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని గవర్నర్ అన్నారు. 10 సూత్రాల అమలు ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధిస్తామని వివరించారు.
Also Read: భారత గణతంత్ర దినోత్సవం గూగుల్ డూడుల్ చిత్రం.. విభిన్న సంప్రదాయాలకు ప్రతీకగా వన్యప్రాణులు
ఇదిలా ఉంటే.. భారత ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. భారత స్వాతంత్య్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి, దేశ ప్రజలందరూ ప్రజాస్వామ్యపు నీడలో సురక్షితంగా, సుభిక్షంగా జీవించడానికి వీలుగా రూపొందిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన శుభవేళ అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకుందామని చెప్పారు వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర విజన్ 2047ల లక్ష్యసాధనకు రాజ్యాంగ స్పూర్తితో కృషి చేద్దామన్నారు సీఎం చంద్రబాబు.