India Republic Day 2025: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రత్యేకంగా ‘వైల్డ్‌లైఫ్ మీట్స్ కల్చర్’ (Wildlife Meets Culture) డూడుల్‌ను రూపొందించింది. ఈ డూడుల్ భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని మరియు ప్రాంతాల భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది.
డూడుల్‌లో లడాఖ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న మంచు చిరుత, ధోతీ-కుర్తా ధరించిన పులి, అలాగే పావురం, నీలగిరి తహర్ వంటి పక్షులు, జంతువులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రతినిధితం చేస్తూ కనిపిస్తున్నాయి. గూగుల్ వివరణ ప్రకారం, ఈ డూడుల్ భారత గణతంత్ర దినోత్సవాన్ని, జాతీయ గర్వాన్ని మరియు ఐక్యతను గౌరవించేందుకు రూపొందించబడింది.
డూడుల్‌లోని మంచు చిరుత లడాఖ్ సంప్రదాయ వస్త్రాలు ధరించి చేతిలో రిబ్బన్ పట్టుకుని కనిపిస్తుంది. పక్కనే ఉన్న పులి సంప్రదాయ వాద్యాన్ని పట్టుకుని నిలిచింది. నీలగిరి తహర్ అందమైన దుపట్టాలతో అలంకరించబడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక అందమైన నెమలి ఆకాశంలో ఎగురుతూ ఉండగా.. ఒక మొసలి, వాయిద్యాలతో ఒక రెడ్ పాండా, ఒక ఉడుతను కూడా చూడవచ్చు.
గూగుల్ డూడుల్ లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకను ప్రతిబింబించే ఈ సుందర కళ వెనుక పుణె నగరానికి చెందిన రోహన్ దహోత్రె అనే కళాకారుడు ఉన్నారు. ఆయన భారతదేశపు విభిన్న సంప్రదాయాలను ఐకమత్య శక్తిగా ఈ చిత్రంలో చూపించారు.
ఈ డూడుల్ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. “నేను వేసిన ఈ చిత్రానికి స్ఫూర్తి నా దేశంలోని విభిన్న వన్యప్రాణులే. ఇండియాలో ప్రకృతి కూడా పలు ప్రాంతాల్లో విభిన్నంగా ఉంటుంది. ఉత్తరాన చల్లని వాతావారణానికి హిమలయాల మంచు కారణమైతే.. దక్షిణాన వింధ్యా పర్వతాలు వర్షాల వల్ల పచ్చని అడవులు కలిగి ఉన్నాయి. నేను వేసిన వన్యప్రాణాలే కాదు. ఇంకా అనేక కొత్త జాతుల గురించి శోధన జరుగుతూ ఉంది. నేను ఈ చిత్రం ప్రారభించిన సమయంలో దేశంలోని విభిన్న సంస్కృతులను చూపించాలను కున్నాను. విభిన్న సంస్కృతులక చెందిన ప్రజలు ఈ జాతి పండుగ జరుపుకుంటున్నట్లు నా చిత్రంలో ప్రతిబింబిచాలనుకున్నాను. కానీ మానవులకు బదులు విభిన్న ప్రాంతాల్లో లభించే జంతువులను చూపిస్తే కొత్తగా ఉంటుందనిపించింది. అందుకే వన్యప్రాణాలకు విభిన్న సంస్కృతులు వేషాధారణలో చూపించాను. ఈ చిత్రం చూస్తున్నసేపు ఏదో ఆసక్తి కలుగుతోంది” అని దహోత్రె తన చిత్రం గురించి వర్ణించారు.
ఈ సంవత్సరం భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవంలో స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ (స్వర్ణ భారత్ సంప్రదాయం, అభివృద్ధి) అనే థీమ్ తో శకటాల ప్రదర్శన జరుగుతుంది. ఈ పరేడ్ కు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా ప్రెసిడెంట్ హెచ్ ఈ ప్రబొవో సుబియాంటో విచ్చేశారు.