Delhi Repulic Day Kartavya Path: దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
కర్తవ్యపథ్‌లో నిర్వహించిన ఈ గణతంత్ర దినోత్సవ కవాతు వేడుకలలో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక ప్రత్యేక శకటాన్ని ప్రదర్శించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మొత్తం 31 శకటాలు ఈ ఏడాది పరేడ్‌లో భాగమవుతాయి. “స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్” అనే థీమ్‌తో రూపొందించిన ఈ శకటాలు భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని, సైనిక శక్తి సామర్థ్యాలను ప్రతిబింబించాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైనిక బలగాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు కలిసి సంయుక్త శకటాన్ని ప్రదర్శించాయి. భూమి, ఆకాశం, సముద్రంలో జరిగే యుద్ధాలకు సంబంధించిన దృశ్యాలతో రూపొందించిన ఈ శకటం ఈ పరేడ్‌లో హైలైట్‌గా నిలిచింది.
సైనిక శక్తిని ప్రదర్శించేందుకు బ్రహ్మోస్ క్షిపణి, పినాకా రాకెట్ లాంచర్, ఆకాశ్ క్షిపణులు, యుద్ధ ట్యాంకులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. డీఆర్‌డీఓ రూపొందించిన “ప్రళయ్” క్షిపణి తొలిసారి ప్రదర్శించబడింది.
పరేడ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రూపొందించిన 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి మరో 15 శకటాలు ప్రదర్శించబోతున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉన్న ఎర్రకోట వరకు మొత్తం 31 శకటాలు ఈ గణతంత్ర వేడుకల్లో పరేడ్ చేశాయి
గణతంత్ర వేడుకలలో 5,000 మంది కళాకారులు వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
ఏటికొప్పాక బొమ్మలు ఆంధ్రప్రదేశ్ ఘనతను ప్రపంచానికి తెలియజేస్తున్న విలక్షణ కళాఖండాలు. సాధారణ కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు, నాణ్యత, సౌందర్యంతో దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకతకు గుర్తుగా నిలుస్తున్నాయి. నునుపుగా, నాజూగుగా ఉండే ఈ బొమ్మలు, చిన్నారుల చేతుల్లో ఆటవస్తువులుగా వినియోగమవుతున్నాయి. అయితే ఈ బొమ్మలను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మెచ్చుకోవడం విశేషం.
ఈ గొప్ప చరిత్ర కలిగిన ఏటికొప్పాక బొమ్మలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక శకటం రూపంలో దర్శనమిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాయి.
రిపబ్లిక్ డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి?
ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలామందికి తెలియకపోవచ్చు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అయితే దీనికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.
సంపూర్ణ స్వరాజ్య తీర్మానం
నిజానికి భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26నే ఆమోదించబడింది. అయితే అమలుకు ప్రత్యేకమైన తేదీ కావాలన్న ఉద్దేశంతో రెండు నెలలు వేచి, 1930 జనవరి 26న జరిగిన చారిత్రక సంఘటనను గౌరవిస్తూ ఈ తేదీని ఎంపిక చేశారు. ఆ రోజు లాహోర్‌లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో “సంపూర్ణ స్వరాజ్యం” తీర్మానం ఆమోదించబడింది. రావీ నది తీరంలో భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆ చారిత్రక దినానికి గుర్తుగా భారత రాజ్యాంగం అమలుకు అదే తేదీని నిర్ణయించారు.
రాజ్యాంగ రూపకల్పన
1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడినా, 1950 జనవరి 26 నుంచి అమలులోకి తీసుకురావడం ప్రారంభమైంది. ఈ రోజుతో బ్రిటీష్ ప్రభుత్వ చట్టం 1935 రద్దయ్యింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుచేసి, డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా.. డాక్టర్ అంబేడ్కర్‌ను ముసాయిదా కమిటీ చైర్మన్‌గా నియమించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి రెండు సంవత్సరాలు, 11 నెలలు, 18 రోజుల సమయం పట్టింది. ఈ ప్రాజెక్టుకు ₹64 లక్షల వ్యయం అయింది.
గణతంత్ర దినోత్సవం అమలు
1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశం పూర్తిగా స్వతంత్రమైన ప్రజాస్వామ్య దేశంగా మారింది. ప్రతీ సంవత్సరం ఈ రోజున దేశం సైనిక శక్తిని, సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శిస్తూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కర్తవ్యపథ్‌లో నిర్వహించే పరేడ్‌లో రాష్ట్రాలు తమ శకటాలతో దేశం సాధించిన అభివృద్ధిని తెలియజేస్తాయి.
హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన
గణతంత్ర దినోత్సవం అంటే ఊరూరా వేడుకలు జరుపుకోవడమే కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగించాల్సిన సమయం. యువత ఈ దేశం పట్ల తమ బాధ్యతలను గుర్తించి, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలి.
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న మాటలను స్మరించుకుంటూ, మన దేశం కోసం ఎప్పటికీ అంకితభావంతో ఉండాలి. జైహింద్!