టీడీపీ నేతలకు మద్దతుగా జగన్ కి చెందిన సాక్షి మీడియాలో వార్తలు ఇస్తారని అస్సలు ఊహించలేం. కానీ ఇటీవల కాలంలో ఇద్దరు టీడీపీ నేతలకు సాక్షి బాగా కవరేజ్ ఇస్తోంది. వారు ఏం మాట్లాడినా టీడీపీ అనుకూల మీడియాకంటే ముందు వైసీపీ మీడియాలో వచ్చేస్తోంది. అందులో ఒకరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఇంకొకరు పిఠాపురం టీడీపీ నేత వర్మ. టీడీపీలోనే ఉంటూ పార్టీని చికాకు పెడుతున్న వీరిద్దరిపై వైసీపీ ఎక్కడలేని ప్రేమ చూపిస్తోంది. వారికి అత్యధిక ప్రయారిటీ ఇస్తోంది.
ఆదినుంచీ వివాదాలే..
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఆదినుంచీ వివాదాస్పదంగానే ఉంది. దూకుడు స్వభావమే ఆయనకు ఎన్నికల్లో టీడీపీ టికెట్ వచ్చేలా చేసింది, ఆ దూకుడే ఇప్పుడు టీడీపీని ఇరకాటంలో పెడుతోంది. ఓ బహిరంగ సభలో రైతులపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత ఆయన మీటింగ్ జరిగితే కచ్చితంగా వైసీపీ ఫోకస్ ఎక్కువగా ఉండేది. ఎక్కడ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వెంటనే వైసీపీ మీడియాలో హెడ్డింగ్ పెట్టి మరీ వేసేవారు.
సాక్షి కవరేజ్..
ఇటీవల కొలికపూడి పార్టీకి కూడా డెడ్ లైన్ పెట్టారు. మరో సీనియర్ నేతపై ఆరోపణలు రావడంతో ఆయనపై 48 గంటల్లోగా చర్యలు తీసుకోవాలంటూ పార్టీకి డెడ్ లైన్ పెట్టారు. కానీ పార్టీ దీన్ని లైట్ తీసుకుంది. కొలికపూడి సైలెంట్ అయినా, అనుకోకుండా వైసీపీ అనుకూల మీడియాకి ఓ అస్త్రంగా దొరికారు. ఆ తర్వాత ఆయనకు వ్యతిరేకంగా తిరువూరులో టీడీపీ నేతలు ఏకమయ్యారని, అక్కడ టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయంటూ సాక్షిలో వరుస కథనాలు వస్తున్నాయి. కూటమిని ఎలా ఎదుర్కోవాలా అని చూస్తున్ వైసీపీకి కొలికపూడి అనుకోని అస్త్రంలా మారారు.
వర్మ వర్సెస్ జనసేన..
పొత్తులో భాగంగా పిఠాపురం సీటుని జనసేనకు ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ పవన్ కల్యాణ్ కోసం తన సీటు త్యాగం చేసిన వర్మ ఆయన గెలుపుకోసం ప్రచారంలో కూడా పాల్గొన్నారు. తీరా పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత వర్మకు అక్కడ పెద్దగా ప్రయారిటీ లభించలేదు. రాను రాను వర్మ తీరులో కూడా మార్పులొచ్చాయి. ఆమధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో వర్మను వైసీపీ అక్కున చేర్చుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేస్తోంది. వర్మ జనాల్లోకి వెళ్తే.. కచ్చితంగా సాక్షి కవరేజ్ ఉంటోంది. వర్మని హైలైట్ చేస్తూ పనిలో పనిగా పిఠాపురం సమస్యల్ని కూడా సాక్షి హైలైట్ చేస్తోంది, పరోక్షంగా పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తోంది. ఇటు వర్మ కూడా వైసీపీ చేతిలో పావుగా మారినట్టు తెలుస్తోంది.
మంటపెట్టే ప్రయత్నాలు
గతంలో వైసీపీ అధికారంలో ఉండగా, అప్పటి ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో ఆ పార్టీ బాగా ఇబ్బంది పడింది. ఆయన పార్టీలోనే ఉండి, పార్టీని ముప్ప తిప్పలు పెట్టారు. ఇప్పుడు ఆ పాత్రని కొలికపూడి, వర్మ విజయవంతంగా పోషిస్తున్నట్టు ఉంది. టీడీపీలోనే ఉంటూ, టీడీపీని ఇరుకున పెట్టే పనులు చేస్తున్నారు వర్మ, కొలికపూడి. వీరికి వంతపాడుతూ సాక్షి మరింత మంట పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.