Village Clinics: ఏపీలో వైద్య సేవలపై ఫోకస్ చేసింది చంద్రబాబు సర్కార్. మారుమూల గ్రామాల్లో ఆసుపత్రుల సదుపాయాల లేక ప్రజలు నానాఇబ్బందులు పడతున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపై ఆ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా దాదాపు 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లకు కొత్త భవనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య సేవలపై దృష్టి సారించింది. ఏపీ అంతటా సర్వే చేయించింది. ఏయే జిల్లాలు ఎలాంటి సమస్యలతో సతమతమవుతున్నారో ఆ మధ్య రిపోర్టును బయటపెట్టారు సీఎం చంద్రబాబు. తాజాగా ఏపీలో 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లకు కొత్త భవనాలు రానున్నాయి.
క్లినిక్‌లున్నా ఇప్పటివరకు చిన్నచిన్న ఇంట్లో కొనసాగుతున్నాయి. ఇందుకోసం భారీగా ఖర్చు చేయనుంది. రూ.1129 కోట్ల వ్యయంతో సొంత భవనాలను నిర్మించనుంది. విలేజ్ క్లినిక్ నిర్మాణ పనులు ఏడాది లోపు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఆ మేరకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
విలేజ్ క్లినిక్‌ల నిర్మాణం పూర్తయితే గ్రామీణ వైద్య సేవలకు మహర్దశ పట్టనుంది. విలేజ్ క్లినిక్ నిర్మాణాల పనులకు అయ్యే ఖర్చులో 80 శాతం కేంద్రం భరిస్తుంది. కేవలం 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవేకాకుండా మిగతా 1379 ఆసుపత్రుల నూతన భవనాలను రూ.753 కోట్లు ఖర్చు కానుంది.
ALSO READ: వైసీపీకి గుబులు పుట్టిస్తున్న నరసాపురం ఎంపీ
16వ ఆర్థిక సంఘం నిధులతో వీటిని చేపట్టేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఏ జిల్లాల్లో ఎక్కువగా విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 284 క్లినిక్‌లకు సొంత భవనాలు ఏర్పాటు కానున్నాయి. ఆ తర్వాత నంద్యాల జిల్లా-272, ఏలూరు జిల్లా-263, కోనసీమ జిల్లా-242, కృష్ణా జిల్లా-240 ఉన్నాయి.
అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా-239, చిత్తూరు జిల్లా- 229, బాపట్ల జిల్లా-211, పార్వతీపురం మన్యం జిల్లా-205, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో 200 చొప్పున కొత్త భవనాలు ఏర్పాటు కానున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 100కి పైగా కొత్త భవనాలను ప్రభుత్వం నిర్మించనుంది.