Ramamurthy Naidu Death: రాజకీయాలు వేరు.. బంధాలు, అనుబంధాలు వేరు. మానవత్వంతో కూడిన జీవనం కూడా వేరు. అయితే రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ ఏదైనా శుభకార్యాలలో కానీ, అశుభకార్యాలలో గానీ రాజకీయాలకు అతీతంగా నాయకులు చెట్టాపట్టలేసుకొని తిరగడం కామన్. అందుకు ఉదాహరణగా తెలంగాణలో ప్రతి ఏడాది నిర్వహించే అలయ్.. బలయ్ కార్యక్రమం కూడా ఒకటని చెప్పవచ్చు.
ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా నేతలు కరచాలనం చేసుకుంటూ సరదాగా గడుపుతారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి, ఓ వర్గం విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అందుకు ప్రధాన కారణం సీఎం చంద్రబాబుతో రాజకీయ విభేధాలు ఉన్నప్పటికీ, ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మరణించిన సమయంలో ఓ పత్రికలో వచ్చిన కథానాలే అంటున్నారు నెటిజన్స్. ఓ వైపు పరామర్శగా ట్వీట్ కూడా వదలని జగన్.. మరోవైపు చంద్రబాబును విమర్శించే రీతిలో కథనాలు అనుకూల మీడియాలో రావడంతో నెటిజన్స్ ఇదే టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు హడావుడిగా బయలుదేరి తన తమ్ముడు చికిత్స పొందుతున్న ఏఐజి వైద్యశాలకు చేరుకున్నారు. అనంతరం తన తమ్ముడు మృతి చెందగా, నిన్ననే నారావారిపల్లె లో అంత్యక్రియలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు, రామ్మూర్తి నాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏకంగా ఫోన్ కూడా చేసి మాట్లాడారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కూడా ట్వీట్ ద్వారా సానుభూతి తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు. కానీ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మేల్యే హోదాలో గల జగన్ మాత్రం ఒక్క ట్వీట్ చేయలేదన్నది నెటిజన్స్ వాదన. రాజకీయాలు వేరు ఆత్మీయతలు వేరంటూనే, దివంగత సీఎం వైఎస్సార్ సీఎం గా ఉన్న సమయంలో రాజకీయాలు వదిలి, ఒకే వేదికపై ఉన్న సమయంలో చంద్రబాబుతో చేయి కలిపారు.. మాట్లాడుకున్నారు. కానీ జగన్ సైలెంట్ గా ఉండడం మాత్రం దేనికి సంకేతం అంటూ నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అలాగే ఓ దినపత్రికలో అదేపనిగా రామ్మూర్తి కూడా బాబు భాదితుడే అంటూ కథనం ప్రచురించడం అనే శీర్షికను పోస్ట్ చేస్తూ.. ఇది మీకు తగునా అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఓ వైపు చెల్లి వైఎస్ షర్మిళ తన హోదాకు తగినట్లుగా సంతాపం వ్యక్తం చేస్తే, జగన్ కు ఆ మాత్రం భాద్యత లేదా అంటూ టీడీపీ సోషల్ మీడియా అంటోంది. మరి జగన్ స్పందించక పోవడం వెనుక ఏ బలమైన కారణం ఉన్నా, స్పందించి ఉంటే బాగుండేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.