Ramanaidu Studios Vizag : రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు విశాఖ జిల్లా అధికారులు. స్టూడియో కోసం కేటాయించిన భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించి నోటీసులు జారీ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
అసలేంటి వివాదం?
2003లో విశాఖ సాగరతీరంలో 34.44 ఎకరాలను అప్పటి టీడీపీ సర్కారు రామానాయుడు స్టూడియోకు కేటాయించింది. ఇప్పుడు అదే టీడీపీ ప్రభుత్వం అందులోంచి 15.17 ఎకరాలను తిరిగి తీసుకోవాలని భావిస్తోంది. ఆ మేరకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది జిల్లా యంత్రాంగం. ఇచ్చిన భూమిలో సగం ల్యాండ్‌ను తిరిగి తీసుకోవడానికి బలమైన కారణమే ఉందంటున్నారు.
స్టూడియో భూముల్లో రియల్ దందా!
విశాఖలో ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రోత్సహించాలని ఆనాటి మార్కెట్ రేటు ప్రకారం ఎకరాకు 5.2 లక్షల చొప్పున సురేశ్ ప్రొడక్షన్స్‌కు ఇచ్చారు. అందులో సుమారు 10 ఎకరాల స్థలంలో స్టూడియో భవనాలను నిర్మించారు. మిగిలిన భూమి ఏళ్లుగా అలానే ఉంది. కట్ చేస్తే.. జగన్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ పెద్దల కన్ను ఆ ఖాళీ భూములపై పడిందంటారు. ఆ పెద్దల ప్రెజర్‌తో బలవంతంగా 15 ఎకరాలను కబ్జా పెట్టారు కొందరు. ఆ ప్రాంతాన్ని నివాస స్థలంగా జీవీఎంసీ రికార్డుల్లో మార్పు చేయించారు. అందులో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. లగ్జరీ విల్లాలు కట్టే ప్రయత్నం చేశారు.
కబ్జాకు చెక్!.. సురేశ్ ప్రొడక్షన్స్‌కు షోకాజ్ నోటీసులు
స్టూడియో భూముల్లో రియల్ దందా ఏంటంటూ.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడారు. రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములను నిర్దేశించిన ప్రయోజనం కోసమే వాడాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. సర్కారు సూచనతో రామానాయుడు స్డూడియోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు విశాఖ జిల్లా కలెక్టరఱ్ ఆర్పీ సిసోడియా. తగినంత సమయం ఇచ్చి ఆ తర్వాత తగు చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
Also Read : నాగబాబుకు టీడీపీ నిరసన సెగ
వైసీపీ పెద్దలకు షాక్?
గత వైసీపీ హయాంలో విశాఖలో అనేక భూఅక్రమాలు జరిగాయని టీడీపీ, జనసేన ఆరోపిస్తోంది. ప్రధానంగా విజయసాయిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై బలమైన విమర్శలు ఉన్నాయి. వైఎస్ భారతి బంధువుల పేర్లు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. రామానాయుడు స్టూడియోలోని ఆ 15 ఎకరాల ఖాళీ స్థలాన్ని కొట్టేసింది కూడా ఆ వైసీపీ పెద్దలేననేది కూటమి నేతల వాదన. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఆ రియల్ వెంచర్‌కు వ్యతిరేకంగా రావడంతో.. ప్రభుత్వం కొరడా ఝులిపించింది. తాజా షోకాజ్ నోటీసులతో వైసీపీ ప్రముఖుల చెరలో ఉన్న ఆ భూములు తిరిగి ప్రభుత్వం చేతుల్లోకి వస్తాయని టీడీపీ అంటోంది. జనసేన సైతం ఆ భూములు తిరిగి వెనక్కి తీసుకురావాల్సిందేనని గట్టిగా పోరాడుతోంది. సీఎం చంద్రబాబు సైతం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశంతో విశాఖ కలెక్టర్ రంగంలోకి దిగారు. రానున్న రోజుల్లో ల్యాండ్ మాత్రమే తిరిగి తీసుకుంటారా? అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు చేపడతారా? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్.