ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల జోరు స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా విశాఖను పరిశ్రమల కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ 9వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు విశాఖలో తమ కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. ఆ కంపెనీలు పని మొదలు పెడితే రూ.20,216 కోట్ల పెట్టుబడులు తరలి వస్తాయి. 50వేలమందికి పైగా ఉపాధి లభించినట్టవుతుంది.
ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు..
కూటమి మేనిఫెస్టోలోని ప్రధాన హామీ 20లక్షల ఉద్యోగాలు. ఈ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ మంత్రి నారా లోకేష్. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు తీసుకు రావడమే లక్ష్యంగా వివిధ కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. తాజాగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 9వ SIPB సమావేశంలో 4 కొత్త కంపెనీలు అందించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖకు చేరుకున్నాయి. ఇప్పుడు రాబోతున్న 4 కంపెనీలతో విశాఖ ఇమేజ్ మరింత పెరుగుతుందన్నారు మంత్రి నారా లోకేష్. భవిష్యత్ పెట్టుబడులకు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని ఆయన ఆదేశించారు.
సిఫీ..
విశాఖలో పెట్టుబడులకు సిద్ధమైన సంస్థల్లో సిఫీ టెక్నాలజీస్ ఒకటి. ఐటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగాల్లో సొల్యూషన్స్, సర్వీసెస్ ప్రొవైడర్‌గా ఈ సంస్థ పనిచేస్తుంది. సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ రూ.3,621 కోట్ల టర్నోవర్ ని కలిగి ఉండగా.. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ కి రూ.1,114 కోట్ల టర్నోవర్ ఉంది. రెండు ప్రాజెక్టులుగా వివిధ దశల్లో ఏపీలో తమ సంస్థల్ని ఏర్పాటు చేయబోతోంది సిఫీ. సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో మొదటిదశలో రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా, 200 మందికి ఉపాధి లభిస్తుంది. రెండోదశలో రూ.15,000 కోట్ల పెట్టుబడులతో మరో 400 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ నుంచి విశాఖలో సిఫీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
సత్వా..
సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కూడా విశాఖ కేంద్రంగా తమ కార్యకలాపాలు మొదలు పెట్టబోతోంది. ఈ సంస్థకు రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ, ఐటీఈఎస్ పార్కులకు సంబంధించిన కార్యాలయాల నిర్మాణంలో అనుభవం ఉంది. ప్రస్తుతం 8 నగరాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు సత్వా విశాఖకు వస్తోంది. సత్వా డెవలపర్స్ సంస్థ మధురవాడలో రూ.1,500 కోట్ల పెట్టుబడులు పెడుతుండగా, 25వేల మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి.
బీవీఎం..
కపిల్ గ్రూప్ కి చెందిన బీవీఎం ఎనర్జీ, రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖలో మినీ స్మార్ట్ టెక్ సిటీ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్ స్పేస్, ఉద్యోగుల గృహ నిర్మాణం వంటివి చేపట్టబోతోంది. ఇక మాతృ సంస్థ కపిల్ గ్రూప్ కి గతంలో ఫైనాన్సియల్ సర్వీసెస్, స్టార్ హోటల్స్, ఐటీ పార్క్స్ నిర్మాణంలో అనుభవం ఉంది. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖ పరిధిలోని ఎండాడలో రూ.1,250 కోట్ల పెట్టుబడులు పెట్టబోదోంది. 15,000 మందికి ఈ సంస్థ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడానికి సిద్ధంగా ఉంది.
ఏఎన్ఎస్ఆర్..
ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజైనింగ్, ఎస్టాబ్లిషింగ్, జీసీసీ ఆపరేటింగ్ రంగాల్లో లీడర్‌గా ఉంది. ఇండియాతో పాటు పోలండ్, యూఏఈలో కూడా బిజినెస్ విస్తరించింది. ఈ సంస్థలో 1.5 లక్షలమంది ఉద్యోగులున్నారు. ఈ సంస్థ మధురవాడలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దీని ద్వారా 10వేలమందికి ఉపాధి లభించబోతోంది.
మొత్తంగా ఈ 4 సంస్థలు కలిపి విశాఖలో రూ.20,216 కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధం చేశాయి. ఈ కంపెనీల ద్వారా 50,600 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి.
SIPB
కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు జరిగిన SIPB సమావేశాల ద్వారా 113 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రూ.5,94,454 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం అయింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన ప్రాజెక్ట్ లు 46 కాగా, ఇంధన రంగానికి చెందినవి 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగలో 11, ఐటీలో 11, ఫుడ్ ప్రాసెసింగ్ లో 4 పరిశ్రమలకు SIPB ఆమోదం తెలిపింది. మొత్తంగా 5.5 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి.