AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త. ఇటీవల కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. నైరుతి రుతుపవనాలు సోమవారం(మే26th) ఏపీని తాకనున్నాయి. దాని ప్రభావంతో నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ తెలిపారు.
మంగళవారం నాటికి పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఇప్పటినుంచే ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
నేడు ఏలూరు, గుంటూరు, నంద్యాల, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు,అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు కురిసే సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావద్దు. వానలు కురుసున్నప్పుడు కరెంట్ పోల్స్, చెట్లకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణశాఖ సూచిస్తోంది. వృద్ధులు, పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని తెలిపింది వాతావరణ శాఖ. వర్షాకాలం.. ఓ వ్యాధుల కాలం. మిగతా సీజన్‌లతో పోలిస్తే వర్షాకాలంలో ఎక్కువగా వైరస్, బాక్టీరియా, ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉంటుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవాలని వైద్యులు సూచించారు.
దక్షిణ కొంకణ్‌కు ఆనుకుని తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. తూర్పుదిశగా పయనించి వచ్చే 24 గంటల్లో మధ్య మహారాష్ట్ర మీదుగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారుతుంది. మరింత బలహీనపడి తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఈ నెల 27వ తేదీనా పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా మారుతుందని కొన్ని వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి.
మన దేశంలో వ్యవసాయానికి ఎంతో ముఖ్యమైనవి నైరుతి రుతుపవనాలు. ఈసారి అంచనా కన్నా ముందుగా రావడం గత 16ఏళ్లలో మొదటిసారి అని వాతావరణ శాఖ తెలిపింది. 1990లో ఒకసారి, 2009లో ఒకసారి మాత్రమే ఇలా జరిగింది. దేశంలో 52% నికర సాగు భూమికి.. ఇప్పటికి కూడా వర్షమే ఆధారం. సాగు భూమి నుంచే 40% దిగుబడి వస్తుంది. తాగునీరు, కరెంట్ ఉత్పత్తి కోసం జలాశయాలను నింపడానికి.. దేశ జీడీపీలో నైరుతి రుతుపవనాలు చాలా కీలక పాత్ర వహిస్తుంటాయి.
Also Read: 100 అంతస్తుల సైజు.. 1,000 అణుబాంబుల శక్తి.. భూమిపైకి దూసుకొస్తున్న ముప్పు..!
మరోవైపు తెలంగాణలో రానున్న 5 రోజులు వర్షాలు పడే అవకాశ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్లా, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.