Lady Aghori: ఎట్టకేలకు అఘోరీ మాత అనుకున్నది సాధించారు. అయితే ఉదయం నుండి టెన్షన్ వాతావరణం మాత్రం అక్కడ నెలకొంది. కానీ చివరకు ఆ ఒక్క మాట ఆలకించి, అఘోరీ మాత అనుకున్నట్లే తన దర్శనం పూర్తి చేసుకున్నారు.
అఘోరీ మాత అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిన అఘోరీ మాత, సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ తల్లి ఆలయంపై దాడి సమయం నుండి వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆత్మార్పణం చేసుకుంటానంటూ ప్రకటించి అఘోరీ మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం తెలంగాణ పోలీసులు రంగప్రవేశం చేసి, నచ్చజెప్పడం మరలా ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవడం అందరికీ తెలిసిందే.
అయితే కార్తీకమాసం ప్రారంభమైన నేపథ్యంలో ఏపీలోని శైవక్షేత్రాలను అఘోరీ మాత సందర్శిస్తున్నారు. గురువారం శ్రీకాళహస్తి లో స్వామి వారిని దర్శించేందుకు వెళ్లిన ఆమెను వస్త్రధారణ పాటించాని ఆలయ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన అఘోరీ మాత, తన కారులోని పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేసి ఆత్మార్పణకు సిద్ధమయ్యారు. స్థానికులు వారించే లోగానే ఒక్కసారిగా, తన ఒంటిపై, కారుపై పెట్రోల్ పోశారు. పోలీసులు ఆ ప్రయత్నానికి అడ్డుతగిలి వారించారు. ఈ సంధర్భంగా పోలీసులకు, అఘోరీ మాతకు కాసేపు వాగ్వివాదం జరిగింది.
ఆత్మార్పణకు సిద్ధమైన అఘోరీ మాతను అంబులెన్స్ ఎక్కించిన పోలీసులు, ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. తాను ఎలాగైనా శివయ్యను దర్శనం చేసుకొని ఇక్కడి నుండి కదులుతానని భీష్మించి కూర్చున్న ఆమెకు, సాయంత్రానికి పోలీసులు వస్త్రధారణ ధరించేలా ఒప్పించారు. సాయంత్రం పోలీస్ ఎస్కార్ట్ రాగా, అఘోరీ మాత వస్త్రధారణ పాటించి శ్రీకాళహస్తి ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారిని దర్శించారు. పోలీసులు కూడా ఆమె దర్శనానికి వచ్చిన సమయంలో కొంత హడావుడి చేశారు.
Also Read: Vangalapudi Anitha: పవన్‌తో అనిత భేటీ.. ఇక సైలెంట్ వార్‌కు శుభం కార్డు పడినట్లేనా?
ఎట్టకేలకు తాను అనుకున్న రీతిలో స్వామి వారిని దర్శించి అక్కడి నుండి బయలుదేరే సూచనలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం ఆత్మార్పణ కు యత్నించడంతో కొంత టెన్షన్ వాతావరణం ఏర్పడగా, ఎట్టకేలకు సాయంత్రం స్వామి వారి దర్శనభాగ్యం తో వివాదం సద్దుమణిగినట్లైంది.