BigTV English

AP Politics: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..

AP Politics: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..
Advertisement

AP Politics: గత ఎన్నికల్లో కులాల కోట్లాటల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబుని మార్కాపురానికి షిఫ్ట్ చేశారు జగన్.. అక్కడ పరాజయం పాలవ్వడంతో తిరిగి ఆయన తన సొంత నియోజకవర్గంపైనే మనసు పారేసుకున్నారట.. వైసీపీ అధ్యక్షుడు చాన్స్ ఇస్తే తిరిగి తన సొంత నియోజకవర్గానికే వెళ్దామనుకుంటున్నారట.. అయితే ..అబ్బో ఆయనా.. మళ్లీ మేం తట్టుకోలేం బాబోయ్ అంటూ ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఆయనను టార్గెట్ చేస్తున్నారట.. ఏ చిన్న మీటింగ్ పెట్టినా.. పార్టీ సమావేశాలకు వెళ్లినా సమయం.. సందర్బం కాకపోయినా ఆ మాజీ ఎమ్మెల్యేపై దుమ్మెత్తి పోస్తున్నారట. దీంతో ఆ పంచాయితీ వైసీపీ అధిష్టానానిక తలనొప్పిగా మారిందట.


ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. బలమైన సామాజిక వర్గం సపోర్టు లేకపోయినా 2019 ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తరువాత రాష్ట్రంలో రెండో అత్యధిక మెజార్టీని సాధించి తనదైన ముద్రవేశారు.. అయితే నోటి దూలతో, కార్యకర్తలపై దుందుడుకుతనంతో తన ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. గత ఎన్నికల ముందు వరకూ ఆయన గిద్దలూరు నియోజకవర్గంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీల నుంచి రాజకీయాలు చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో గిద్దలూరు నుంచి బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు.


గిద్దలూరు హీరో నుంచి జీరోగా మారిపోయిన మాజీ ఎమ్మెల్యే

అయితే అతని నోటి దురుసుతనంతో గిద్దలూరు వైసీపీలో హీరో నుంచి జీరోగా మారిపోయారు.గత ఎన్నికలకు ముందు ఆయనపై నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటంతో వైసీపీ అధిస్టానం ఆదేశాల మేరకు మర్కాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు అన్నా రాంబాబు. అసలు గత ఎన్నికలకు ముందు పొలిటికల్ స్క్రీన్ నుంచి దూరంగా వెళ్లిపోతున్నా అంటూ ప్రకటించిన ఆయన మనసు మార్చుకుని పోటీ చేసినా ఓటమి మాత్రం తప్పలేదు.

కొందర్ని సొంత సెగ్మెంట్లకు పంపించే యోచనలో వైసీపీ

అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేసి చేతులు కాల్చుకున్న వైసీపీ కొందరిని తిరిగి వారి సొంత నియోజకవర్గాలకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందన్న ప్రచారం జరుగుతుంది. అయితే గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ క్యాడర్ మాత్రం అన్నా రాంబాబు పేరు ఎత్తితే చాలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఏ మీటింగ్ పెట్టినా అన్నా రాంబాబు పంచాయితీనే నడుస్తోందట. రాంబాబు రీఎంట్రీపై క్యాడర్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సమావేశాలకు వచ్చే వైసీపీ నాయకులు నీళ్లు నములుతున్నారట. వైసీపీకి కంచుకోట లాంటి గిద్దలూరు నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో టీడీపీ ఢీ కొట్టింది.. 2019 ఎన్నికల్లో 81,035 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుచుకున్న ఆ నియోజకవర్గాన్ని 2024 ఎన్నికల్లో 973 ఓట్ల స్వల్ప తేడాతో వైసీపీ చేజార్చుకుంది.. వైసీపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ ఓటమి ఒంగోలు పార్లమెంట్ స్దానం చేజారటంలో కూడా ప్రభావితం చూపిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి.

గిద్దలూరు నుంచి 81 వేల మెజార్టీతో గెలిచిన రాంబాబు

2009 ముందు వరకూ కాంట్రాక్టర్ గా పని చేసే అన్నా రాంబాబు 2009లో అప్పటి ప్రజారాజ్యం పార్టీలో చేరి గిద్దలూరు నుండి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత కాంగ్రెస్, టీడీపీలో పని చేసిన అన్నా రాంబాబు 2019 ఎన్నికల వేళ వైసీపీ కండువా కప్పుకున్నారు. 2019లో ఎన్నికల్లో గిద్దలూరు నుండి మరో సారి పోటీ చేసి 81 వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. దీంతో గిద్దలూరులో అన్నా రాంబాబుకి తిరుగులేదని అప్పట్లో ఫ్యాన్ పార్టీ నేతలు భావించారు. స్టేట్ లోనే పులివెందుల తర్వాత ఆ స్దాయిలో భారీ మెజారిటీతో గెలవడం.. వైసీపీ అధికారంలో ఉండటంతో అన్నా రాంబాబు ఒంటెద్దు పోకడలు పోతున్నారని గత వైసీపీ ప్రభుత్వంలో గిద్దలూరు క్యాడర్ తాడేపల్లికి ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేశారు.

మార్కాపురంలో వ్యతిరేక ప్రచారం చేసిన గిద్దలూరు నేతలు

గిద్దలూరులో తనకి వ్యతిరేకంగా వైసీపీలో మరో గ్రూపు కూడా తయారవటంతో విసుగెత్తిపోయిన రాంబాబు 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటనలు చేశారు. అయితే గిద్దలూరులో అసంతృప్తుల పోరు తట్టుకోలేక అన్నా రాంబాబు 2024 ఎన్నికల నుండి తప్పుకుందామని భావిస్తే.. వైసీపీ అధిష్టానం మాత్రం ఆయన్ని గిద్దలూరు నుండి మార్కాపురం కి బదిలీ చేసింది. అయితే గత ఎన్నికల్లో మార్కాపురం నుండి పోటీ చేసినా.. ఆయనకు ఓటమి తప్పలేదు. అప్పటి ఎన్నికల ప్రచార సమయంలోనూ గిద్దలూరులో రాంబాబు వ్యతిరేక వైసీపీ వర్గం మార్కాపురంలో కూడా ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయటంతో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్‌గా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నాగార్జునరెడ్డి ఉన్నారు. నియోజక వర్గంలో నాగార్జునరెడ్డి వైసీపీ క్యాడర్‌తో ఏ మీటింగ్ పెట్టినా గత వైసీపీ ప్రభుత్వంలో అన్నా రాంబాబు తమని వేధించారంటూ బాధితులు ఆందోళనకి దిగుతున్నారట. గతంలో ఆయనను విభేదించిన వారిని పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవ లేదని స్థానిక వైసిపి నేతలు కూడా వాపోతున్నారట. తాము ఆయనతో విభేదించామే తప్ప పక్కా వైసీపీ అంటూ చెప్పుకొస్తున్నారంట.

ఆందోళన కార్యక్రమంలోఅన్నా రాంబాబు వ్యతిరేక వర్గం రచ్చ

ఈ నేపధ్యంలోనే ఇటీవల గిద్దలూరులో వైసీపీ నాయకులు రీకాల్ చంద్రబాబు కార్యక్రమాన్ని పెడితే అన్నా రాంబాబు వ్యతిరేక వర్గం నానా రచ్చ చేశారు.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ కార్యకర్తలని కూడా చూడకుండా కేసులు పెట్టి వేధించారని కొంత మంది.. తమ బిల్లులు రాకుండా చేశారని మరి కొంత మంది సమావేశంలో ఆందోళనకి దిగారు. మరో సారి ఇలా జరగకుండా చూస్తామని కార్యక్రమానికి హాజరైన వైసీపీ నేతలు సర్థిచెప్పేందుకు ప్రయత్నించినా రాంబాబుపై వ్యతిరేకత మాత్రం తగ్గలేదంట. గిద్దలూరు వైసీపీ కార్యకర్తలు పార్టీ మీటింగుల్లో.. మాకొద్దు అన్నా రాంబాబు నినాదాలు చేస్తున్నారు. దీంతో తాను గిద్దలూరు నియోజక వర్గాన్ని వదిలి పెట్టి ఏడాదిన్నర దాటినా.. ఇంకా కొందరు పనిగట్టుకుని తన మీదే ఆరోపణలు చేస్తున్నారంటూ వీడియో రిలీజ్ చేసిన రాంబాబు వారిపై ఫైర్ అయ్యారు.. కావాలనే కొందరు ఇలా చేస్తున్నారని వాపోతున్నారంట ఆయన.. తాను ఎంత తగ్గాలని చూస్తున్నా రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట .. గత ఎన్నికల ముందు కూడా కొందరు పనిగట్టుకుని తనపై లేని వ్యతిరేకతను ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేశారని గగ్గోలు పెడుతున్నారంట.

గిద్దలూరు భాద్యతలు అప్పగిస్తారని భావిస్తున్న రాంబాబు

అనుకున్నవి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వైసీపీ అధిష్టానం త్వరలోనే తనకు మార్కాపురం నుంచి గిద్దలూరు భాద్యతలు అప్పగిస్తారని రాంబాబు భావిస్తున్న తరుణంలో.. ఆ నియోజకవర్గ క్యాడర్ కు మాత్రం ఆయనపై ఇంకా ఆగ్రహం తగ్గక పోవటం నోట్ చేసుకోవాల్సిన పాయింటే అంటున్నారట పొలిటికల్ పండిట్స్. మరి గిద్దలూరు వైసీపీ పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయనేది చూడాలి. ఏది ఏమైనా అన్నా రాంబాబు మాకు వద్దు అంటూ ఒకవైపు గిద్దలూరు క్యాడర్ వ్యతిరేకిస్తుంటే.. మరోవైపు మార్కాపురంలో సైతం వైసీపీ కార్యకర్తలు ఆయన్ని పట్టించుకోవడం లేదంట. దాంతో అన్నా రాంబాబు పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందన్న ఆవేదన.. అటు ఆయనతో పాటు కుటుంబ సభ్యులు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. కుమారుడి భవిష్యత్తు కోసమే రాజకీయం అంటూ అన్నా రాంబాబు మార్కాపురం నుంచి పోటీ చేసి.. తన ఇమేజ్‌ను డామేజ్ చేసుకున్నారనే ఆపవాదను మాత్రం మూట కట్టుకున్నారనే ప్రచారం మాత్రం జోరు అందుకుంది.

Also Read: ఏపీలో రూ.53 వేల కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే!

తనకు ఆరోగ్యం బాగాలేదు రాజకీయాల నుంచి అనుకుంటున్నానన్న అన్నా రాంబాబు వెంటనే మాట మార్చుకొని 2024 ఎన్నికలలో పోటీ చేయటమే అతనికి మైనస్‌గా మారిందని గిద్దలూరు నియోజకవర్గాల్లో ప్రచారంనడుస్తుందట. కొడుకు భవిష్యత్తు కోసం గిద్దలూరు నుంచి పోటీకి ఏదో ఒక పార్టీ అంటూ ప్రయత్నం చేసి.. చివరకు ఏదీ కుదరక వైసీపీలో మార్కాపురం నుంచి పోటీ చేసి ఓటమి చెందటమే కాక తన కుటుంబ రాజకీయ భవిష్యత్తును కూడా జీరో గా మార్చుకున్నారని అతని అభిమానులు ఆయన ముందే చెప్తున్నారంట. చివరకు ఆయన అభిమానులలో కూడా అన్నారాంబాబు భవిష్యత్తుపై అనుమానం నెలకొందట. 2024 ఎన్నికలకు ముందే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించిన అన్నా రాంబాబు తప్పుకోకుండా పోటీ చేయడం అతనికి చెడ్డ పేరు తెచ్చిందని, మళ్లీ పోటీ చేసి స్థాయిని దిగజార్చుకున్నారనే అపవాది మాత్రం అటు గిద్దలూరు ఇటు మార్కాపురంలో నడుస్తుందట. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పడుతున్న నేపథ్యంలో మరి వైసిపి అధిష్టానం అతనిని కనికరిస్తుందా.. ఆయన సెగ్మెంట్లలో బలమైన రెడ్డి సామాజిక వర్గం వైపు అధిష్టానం చూస్తోందో చూడాలి మరి.

Story By Rami Reddy, Bigtv

Related News

CM Chandrababu: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుక.. డీఏ ప్రకటన, ఎప్పటినుంచి అంటే?

Janasena Internal Fight: పవన్ వద్దకు చేరిన నెల్లూరు జనసేన పంచాయితీ.. టీ గ్లాస్ లో తుఫాన్ ఏ తీరానికి చేరుతుందో?

Investments To AP: నవంబర్ లో CII సమ్మిట్.. YCP కడుపు మంట పెరిగి పోతుందా?

AP Govt on BPS: అనుమతులు లేని ఇళ్లకు క్రమబద్దీకరణ.. బీపీఎస్ పై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

AP Heavy Rains: రానున్న 2-3 గంటల్లో ఉరుములతో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హైఅలర్ట్

AP Politics: పవన్ కోసం వర్మ జీరో..? ఆ ఆడియో ఎలా లీకైంది..

Minister Post MLA Balakrishna: బాలయ్యకు బంపర్ ఆఫర్.. మంత్రి పదవి పక్కా..?

Narayana Varma: పిఠాపురంలో వర్మను జీరో చేశామన్న వ్యాఖ్యలపై మంత్రి నారాయణ వివరణ

Big Stories

×