
Visakhapatnam news today telugu(Latest news in Andhra Pradesh) :
పశ్చిమ బెంగాల్ విద్యార్థిని రీతి సాహ మృతి కేసు విశాఖ పోలీసుల మెడకు బిగుసుకుంటోంది. ఈ కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది. రీతి మృతిపై పశ్చిమ బెంగాల్‌లో కేసు నమోదైంది. దీంతో ఆ రాష్ట్ర సీఐడీ రంగంలోకి దిగింది. బెంగాల్ సీఐడీ అధికారులు విశాఖలోని వెంకటరామ హాస్పటల్లో విచారణ చేపట్టారు. సాధన హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి రీతి కింద పడిన తర్వాత
స్థానికంగా ఉన్న ఈ ఆస్పత్రిలోనే ఆమెను చేర్చారు. ఈ కేసును బెంగాల్ సీఐడీ, విశాఖ పోలీసులు వేర్వేరుగా విచారణ చేస్తున్నారు.
రీతి సాహ మృతి కేసులో చాలా అంశాలపై క్లారిటీ రావాల్సిఉంది. ఆమె హాస్టల్ పైకి వెళ్లినప్పుడు ఒక డ్రెస్.. కిందకు పడినప్పుడు మరో డ్రెస్ ఎలా ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యా? ప్రమాదమా? హత్యా? అనేది తేలాల్సిఉంది. ఆమె కిందకు పడిపోయిన దృశ్యాలు ఏ సీసీ కెమెరాలోనూ రికార్డు కాకపోవడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసుల తీరుపై రీతి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాలేజ్ యాజమాన్యానికి అనుకూలంగా కేసు దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. రీతి సాహ తండ్రి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హాస్టల్, ఆసుపత్రి నుంచి సీసీటీవీ ఫుటేజీ సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.
రీతి సాహ మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ కేసులో నిజాలను బయటపెట్టాలని స్పష్టం చేశారు. దర్యాప్తును వేగవంతం చేయించాలని ఏపీ సీఎం జగన్‌ను కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలని సీఎం జగన్ కూడా ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే రీతి సాహది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని విశాఖ సీపీ త్రివిక్రవర్మ తెలిపారు. హత్య జరిగినట్లుగా ఎక్కడా ఆధారాలు లభించలేదన్నారు. అందువల్లే హత్యకేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.
రీతి సాహ మృతి చెంది 45 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు కేసులో ఎలాంటి పురోగతి లేదు. దీంతో వెస్ట్ బెంగాల్ సీఐడీ రంగంలో దిగడం విశాఖ పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే విశాఖ ఫోర్త్ టౌన్ సీఐ శ్రీనివాసరావును వీఆర్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తును కౌంటర్ ఇంటిలిజెంట్స్ అప్పగించారు. మరోవైపు బెంగాల్ సీఐడీకి చెందిన సీఐ, ఎస్ఐ రెండు రోజులుగా వైజాగ్ లోనే రీతూ సాహ పడిపోయిన హాస్టల్, చుట్టుపక్కల పరిసరాలు, ట్రీట్ మెంట్ తీసుకున్న హాస్పటల్స్‌లో విచారణ చేపట్టారు.