AP Government: పేద, మధ్యతరగతివారికి తీపి కబురు. ఇళ్లు, భవనాలు కట్టుకోవాలనుకునే వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగాల్సిన పని లేదు. కొత్తగా స్వీయ ధ్రువీకరణ స్కీమ్ మొదలైంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం.
దరఖాస్తు చేసుకున్న వెంటనే క్షణాల్లో అనుమతులు పొందవచ్చు. నగరాలు, పట్టణాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడుతుంది. లైసెన్స్ ఉన్న సాంకేతిక నిపుణులు సహాయంతో అనుమతులు పొందవచ్చు.
ఇళ్ల నిర్మాణాల అనుమతులు సులభతరం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. అయితే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించనుంది. ఇళ్లు, భవనాల చుట్టూ ఖాళీ స్థలం (SET BACK) విడిచిపెట్టే విషయంలో తేడా చేస్తే అనుమతులు రద్దు అయినట్టే. అలాగే అనుమతులకు మించి అదనపు ఫ్లోర్లు వేసినా కొరడా ఝులిపించడం ఖాయం. ఇళ్లు, భవనాలు నిర్మాణాలు చేపట్టేవారు కొన్ని సూచనలు పాటించాలి.
స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఖాళీ స్థలానికి సంబంధించి ఫోటో, పన్ను రసీదు లైసెన్స్ ఉన్న సాంకేతిక నిపుణులు- ఎల్‌టీపీకి ఇవ్వాలి. వాటిపై సంతకాలు చేసి ఫీజులు చెల్లించాలి. ఇంటి ప్లాన్, అవసరమైన పత్రాలు జతచేయాలి. ఫీజు చెల్లించిన రసీదుతో సహా డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
ALSO READ: ప్లాన్ మార్చిన సీఎం చంద్రబాబు.. మహిళలకు అగ్రభాగం, ఏఎంసీ చైర్మన్ల భర్తీ
వెంటనే నిర్మాణానికి సంబంధించి అనుమతి వచ్చినట్లుగా ఓకాపీ వస్తుంది. అప్పుడు ఇంటి నిర్మాణం పనులు మొదలు పెట్టవచ్చు. తొలుత ఇంటికి పునాదులు వేసిన తర్వాత ఎల్‌టీపీలు పరిశీలిస్తారు. దాని తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగానికి రిపోర్ట్ చేస్తారు. అధికారులు తనిఖీల తర్వాత అంతా ఓకే అనుకుంటే కట్టుకోవచ్చు.
ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలుంటే నోటీసులు ఇస్తారు. వివరణ తీసుకున్న తర్వాత అనుమతులు రద్దు చేస్తారు. ఒకవేళ తప్పుడు పత్రాలతో అనుమతులు తీసుకుంటే ఎల్‌టీపీల లైసెన్స్ రద్దు చేస్తుంది ప్రభుత్వం.
కార్పొరేషన్లలో 237 చదరపు గజాల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి పార్కింగ్‌తోపాటు మూడు అంతస్తుల వరకు పర్మీషన్ ఉంటుంది. అదే పట్టణాలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 360 చదరపు గజాల స్థలంలో పార్కింగ్ తోపాటు మూడు అంతస్తుల వరకు అనుమతి ఉంటుంది. 200 చదరపు మీటర్లలో ఇంటి నిర్మాణం కావాలంటే ఇంటి ముందు ఒక మీటరు, మూడు వైపులా 0.75 మీటర్లు ఖాళీ స్థలం ఉండాలి.
200 నుంచి 300 చదరపు మీటర్ల నిర్మాణాల విషయంలో ముందువైపు 1.5 మీటరు, మూడు వైపులా ఒక మీటరు స్థలం విడిచిపెట్టాలి. సిటీల్లో 200 చదరపు మీటర్ల లోపు నిర్మాణాలపై 10 శాతం స్థలం తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. 300 చదరపు మీటర్ల నిర్మాణాలకు పట్టణాభివృద్ధి, మున్సిపల్, నగర పంచాయతీల్లో తనఖా అవసరం లేదు.
ప్రతీ ఏటా మున్సిపాలిటీలు, సిటీల్లో 40 వేల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్నారు పేద, మధ్యతరగతి ప్రజలు. అందులో 100 -200 చదరపు గజాల్లోపు ఇళ్లు పేదలు నిర్మించుకుంటున్నారు. అవి దాదాపు 80 శాతం వరకు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా. వారి ఇళ్ల అమనుతుల విషయంలో పట్టణాభివృద్ధి సిబ్బంది లంచాలు ఇచ్చే బెడద పోయినట్టే.