Chandrababu Speech in Jaggampet Prajagalam Sabha: ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వసం సృష్టించిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీపై చంద్రబాబు మండిపడ్డారు.
కాకినాడ జిల్లా జగ్గంపేటలో నిర్విహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు వైసీపీ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. మద్యం నిషేధం చేసిన తర్వాతనే ఓటు వేయండంటూ అడుగుతానన్న సీఎం జగన్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన మాటల నిలబెట్టుకున్నారా..? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఆఖరికి చిన్న టీ కొట్టులోనూ ఆన్ లైన్ పేమెంట్ చేస్తుంటే.. మద్యం దుకాణాల్లో ఎందుకు ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ పెట్టలేదని వైసీపీని చంద్రబాబు నిలదీశారు. సీపీఎస్ రద్దు చేస్తామని గతంలో జగన్ ఉద్యోగులకు మాటిచ్చారు, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ యువతకు మాటిచ్చారు.. ఇప్పుడు ఆ హామీలన్నీ ఎక్కడికి పోయాయన్నారు.
Also Read: AP Congress List: 38 మందితో కాంగ్రెస్ జాబితా విడుదల..
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెరగలేదని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత భారీగా పెరిగాయన్నారు. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలి సంతకం డీఎస్సీ పైనే ఉంటుందని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండేలా టీడీపీ మేనిఫెస్టే తయారు చేశాం అని చంద్రబాబు జగ్గంపేట సభలో వెల్లడించారు.
మహిళలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తామని మరోసారి తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికీ వచ్చి రూ.4 వేలు ఫించను అందిస్తామన్నారు. పేదలకు రెండు లేదా మూడు సెంట్ల ఇంటిస్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును రాజు చేసే బాధ్యత తనదని వెల్లడించారు.