విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఒక సుదీర్ఘ ట్వీట్ వేశారు. 98 డివిజన్లు ఉన్న విశాఖలో 30 సీట్లు గెలిచిన టీడీపీ ఏరకంగా మేయర్ సీటు కావాలని అడుగుతోందని నిలదీశారు. దీంతో ఆయనకు సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. మరి 11 సీట్లు వచ్చిన మీరు ప్రతిపక్ష నేత హోదా ఎలా అడుగుతున్నారని నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. గతంలో కాకినాడలో టీడీపీకి చెందిన మహిళా మేయర్ ని దించేసిన వైసీపీ నేతలకు విశాఖ మేయర్ గురించి మాట్లాడే అర్హత అసలు లేదంటున్నారు.
జగన్ ఏమన్నారంటే..?
సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని అన్నారు జగన్. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడ.. దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అని విమర్శించారు. ప్రజల తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖ కార్పొరేషన్‌లో వైసీపీ 58 స్థానాలు గెల్చుకుందని, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందని, మరి వారికి మేయర్ పదవి ఎలా వస్తుందని నిలదీశారు. సరిగ్గా ఈ పాయింట్ నే నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. 30 సీట్లకు మేయర్ పదవి రాదు సరే, మరి 11 సీట్లకు ప్రతిపక్ష నేత హోదా వస్తుందా జగన్ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష హోదా లేదంటూ తాను అసెంబ్లీకి రావడమే మానేసిన జగన్ కు, 30 సీట్లతో టీడీపీకి మేయర్ పదవి వస్తుందో లేదో తీర్పు చెప్పే అర్హత లేదంటున్నారు.
.@ncbn గారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, మీరు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.
ప్రజలు ఇచ్చిన…
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2025
ప్రలోభపెడతారా..?
వైసీపీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవ కులానికి చెందిన మహిళకు మేయర్ పదవి ఇచ్చిందని, కానీ టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడి, కోట్లాది రూపాయలతో తమ కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ అవిశ్వాస తీర్మానంలో నెగ్గిందని చెప్పారు జగన్. దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలా..? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కూడా వెంటనే నెటిజన్లు కౌంటర్లు రెడీ చేశారు. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడ మేయర్ విషయంలో కూడా ఇలాంటి సీన్ జరిగింది. కాకినాడ మహిళా మేయర్ ని వైసీపీ దించేసింది. అప్పుడు వైసీపీకి అక్కడ మెజార్టీ లేదు. టీడీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకొని మేయర్ ని దించేశారు. అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే కదా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
లాజిక్ మిస్సయ్యావ్ జగన్..!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. అధికార దుర్వినియోగానికి ఆ ఎన్నికలు పరాకాష్ట అని చెబుతున్నారు టీడీపీ నేతలు. అలాంటి జగన్, ఇప్పుడు నీతి సూత్రాలు వల్లించడమేంటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో ఎంతమంది బీసీ నేతల్ని ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు కొత్తగా విశాఖ మేయర్ బీసీ మహిళ అంటూ సింపతీ కార్డ్ చూపించడమేంటని ప్రశ్నిస్తున్నారు. తాను చేస్తే నీతి, పక్కవాళ్లు చేస్తే అవినీతి అనడం జగన్ కే చెల్లిందని చెబుతున్నారు.