Vishaka District: లంకె బిందెల పేరుతో దొంగ బాబా ఘరానా మోసానికి పాల్పడిన.. ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఆనందపురం మండలం బంటుపల్లి వారి కల్లాలకు చెందిన అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగ బాబా మరో ఆరుగురుతో కలిసి ఈ బాగోతానికి పాల్పడినట్టు తెలుస్తోంది. రెండు నెలల క్రితం అప్పలరాజుకు బంధువుల ద్వారా.. యోగేంద్ర బాబా అలియాస్ పైడిపాటి వెంకట భార్గవ్ రాఘవ పరిచయం అయ్యారు. పూజలు చేస్తే లంకెల బిందెలు దొరుకుతాయని నమ్మించాడు. లంకె బిందెలు వెతకడానికి, పూజలకు లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతాయని వారికి తెలిపాడు.
అప్పలరాజు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాబాకు పలు దఫాలుగా 28 లక్షలు ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ మేరకు తన ప్లాన్ ప్రకారం ఆనందపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు దొంగ బాబా. ఆ తర్వాత గుడిలోపలోని నిర్మానుష్య ప్రాంతంలో రాళ్లతో నింపిన నకిలీ లంకెల బిందెలను పాతిపెట్టారు. అప్పలరాజు సహా మిగతావారిని అక్కడికి తీసుకెళ్లి.. పూజలు నిర్వహించాడు.
పూజలు అనంతరం లంకె బిందెలను పాతిపెట్టిన స్థలాన్ని తవ్వించాడు. లంకె బిందెలు బయటపడటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. వాటిని ఆనందపురంలో అద్దెకి తీసుకున్న ఇంట్లో ఉంచి పూజలు నిర్వహించిన అనంతరం తెరవాలని దీని కోసం కొంత డబ్బులు తీసుకురావాలని బాధితులకు తెలిపారు.
పూజలు చేయకపోతే రక్తం కక్కుకుని చస్తారంటూ వారిని భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో మిగతా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు బాధితులు. డబ్బులు ఇచ్చేందుకు బాబాకు ఫోన్ చేసినప్పటికీ ఎత్తకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన ఆనందపురం సిఐ వాసు నాయుడు దొంగబాబాతో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
Also Read: వైజాగ్‌లో క్రికెట్ బెట్టింగ్.. ‘బిగ్ బాస్’ కోసం పోలీసుల వేట..
వీరిలో పైడిపాటి వెంకట భార్గవ్ రాఘవ పేరిట అలియాస్ యోగేంద్ర బాబాపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మరో 7 కేసులు నమోదయినట్టు వెల్లడించారు. ప్రజలు డబ్బు మీద ఆశతో దొంగ బాబాల చేతిలో మోసపోవద్దంటున్న సీఐ వాసు నాయుడు పేర్కొన్నారు.