Kalisetti Appala Naidu: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై విజయనగరం టిడిపి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొట్టేస్తున్నారంటూ జగన్ మాట్లాడటం అత్యంత హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ఈ ప్రాజెక్టుపై గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఎర్రబస్సు రాని చోట ఎయిర్‌పోర్టా? అన్నదే జగన్ క్రెడిట్!
జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో భోగాపురం వచ్చి, ‘కనీసం ఎర్రబస్సు కూడా సరిగ్గా రాని ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ఎందుకు? ఎర్రబస్సు లేని చోటికి ఎయిర్ బస్ ఎలా వస్తుంది?’ అని అవహేళనగా మాట్లాడారని కలిశెట్టి గుర్తుచేశారు. ఆ రోజు ఉత్తరాంధ్ర ప్రజలను తీవ్రంగా అవమానించిన జగన్, ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్టు క్రెడిట్ నాదే అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జగన్ వ్యవహరిస్తున్న తీరును చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
జగన్ క్రెడిట్ చోరీ చేస్తే జైలుకే వెళ్తారు!
త్వరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారని ఎంపీ వెల్లడించారు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు శ్రమ వల్లే ఈ కల సాకారమవుతోందని స్పష్టం చేశారు. ‘జగన్ క్రెడిట్‌ను ఎవరూ దొంగిలించాల్సిన అవసరం లేదు.. ఒకవేళ ఆయన క్రెడిట్‌ను ఎవరైనా చోరీ చేస్తే నేరుగా జైలుకే వెళ్లాల్సి వస్తుంది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
లోకేష్ సవాల్‌కు జగన్ పారిపోయారు
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థ అత్యద్భుతంగా ముందుకు వెళుతోందని కలిశెట్టి కొనియాడారు. మెగా డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అత్యంత పారదర్శకంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. విద్యాశాఖ అభివృద్ధిపై మంత్రి లోకేష్ విసిరిన బహిరంగ సవాల్‌ను స్వీకరించలేక జగన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో కూడా వైకాపా ఎంపీ డీఎస్సీ అంశంపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ దేశాన్ని, సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
తిరుపతిలో 90 వేల దొంగ ఓట్లు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుపతిలో ఏకంగా 90 వేల దొంగ ఓట్లను చేర్చి అక్రమంగా ఎన్నికల్లో గెలిచారని కలిశెట్టి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ దొంగ ఓట్లన్నింటినీ గుర్తించి తొలగించామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధానాలు, పాలన ఈ దేశానికి, తెలుగు ప్రజలందరికీ ఒక గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు.
Also Read: తగ్గేదేలే అంటున్న సీఎం.. రద్దు చేయాల్సిందేనంటున్న ప్రతిపక్షాలు.. హైడ్రా రగడలో గెలుపెవరిది?