పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెళ్లిన స్కూల్ లో బెంచీలు నాడు-నేడు పథకంలో భాగంగా జగన్ ఏర్పాటు చేసినవి అని వైసీపీ ట్రోలింగ్ మొదలు పెట్టింది. ఓకే, అది నిజమే కావొచ్చు. ఒక ప్రభుత్వ హయాంలో స్కూల్ కి బెంచీలు ఇస్తే, ఇంకో ప్రభుత్వం వాటిని ఉపయోగించకూడదా..? పోనీ ఉపయోగిస్తే అదేమైనా పరువు తక్కువా..? అదే నిజమైతే మరి చంద్రబాబు కట్టిన అసెంబ్లీలో జగన్ ఎందుకు కూర్చున్నారు. ఆయన హయాంలో నిర్మించిన సెక్రటేరియట్ లో జగన్ కేబినెట్ ఎందుకు కొలువుదీరింది..? వరుస ప్రశ్నలు సంధిస్తోంది టీడీపీ. వైసీపీ ట్రోలింగ్ ని పూర్తిగా రివర్స్ బాట పట్టించింది.
నాడు-నేడు..
జగన్ హయాంలో అమలైన పథకం ఇది. అయితే ఈ పథకం ద్వారా ప్రజల సొమ్ముని కొంతమంది కాంట్రాక్టర్లకు ప్రభుత్వం కట్టబెట్టిందనే విమర్శలున్నాయి. నాడు-నేడులో జరిగిన కొన్ని పనులు నాసిరకంగా ఉన్నాయని, మరికొన్ని చోట్ల అసలు పనులే మొదలు కాలేదని కూడా అంటున్నారు. పనులు పూర్తయిన చోట్ల కొత్త బెంచీలు వచ్చాయి, స్కూల్ గోడలకు కొత్తగా రంగులేశారు. అలాంటి ఓ స్కూల్ కి చంద్రబాబు, లోకేష్ వెళ్లారు. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు జడ్పీ హైస్కూల్ లో జరిగిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బాగా జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ కార్యక్రమంపై విమర్శలు చేయలేక, నాడు-నేడు అంటూ వైసీపీ వెటకాలం మొదలు పెట్టిందని టీడీపీ శ్రేణులంటున్నాయి. నాడు-నేడు పథకం ద్వారా ఏర్పాటు చేసిన బెంచీలపై చంద్రబాబు, లోకేష్ కూర్చున్నారంటూ వైసీపీ చేస్తున్న విమర్శల్ని టీడీపీ తిప్పికొట్టింది.
ప్రభుత్వాలు మారినా వారు చేసిన పనులు, వాటి ప్రతిఫలాలు అలానే ఉంటాయి. కొత్త ప్రభుత్వం వాటిని కొనసాగిస్తుంది కానీ, పాతవాటిని పూర్తిగా తుడిచిపెట్టాలని చూడదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తోంది కూడా అదే. నాడు-నేడు ద్వారా సమకూరిన సౌకర్యాలను కొనసాగించేందుకు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారని చెబుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన కొన్ని తప్పుల్ని ఆయన సరిచేస్తున్నారనేది టీడీపీ నేతల వాదన. పిల్లలకు ఇచ్చే బ్యాగ్ లపై పార్టీల రంగులు లేకుండా, పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా లోకేష్ మంచి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇలాంటి టైమ్ లో నాడు-నేడు మా గొప్పదనం అంటూ వైసీపీ చేస్తున్న విమర్శల్ని వారు తిప్పికొడుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు కట్టించారని.. వాటిని తర్వాత వచ్చిన ప్రభుత్వం వినియోగించుకోలేదా అని లాజిక్ తీస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో చేపట్టిన మంచి పనుల సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు. కేవలం క్రెడిట్ కోసమే వైసీపీ ట్రోలింగ్ మొదలు పెట్టిందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం అలాంటి క్రెడిట్ కోరుకోవడం లేదని అంటున్నారు. కేవలం మంచి చేయడమే చంద్రబాబు పని అని, కానీ బటన్ నొక్కడానికే విపరీతమైన ప్రచారం చేసుకున్న ఘనత జగన్ కి మాత్రమే దక్కుతుందని ఎద్దేవా చేస్తున్నారు.