Gudivada : గుడివాడ గరంగరంగా మారింది. కాస్త గ్యాప్ తర్వాత పొలిటికల్ హీట్ ఎగిసింది. వైసీపీ వర్సెస్ టీడీపీ రచ్చ రచ్చ. ‘బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ’ అంటూ ప్రతిపక్షం రాజకీయం స్టార్ట్ చేసింది. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అంటూ అధికార పార్టీ కౌంటర్ మొదలెట్టింది. రోడ్లపై ఇరు పార్టీ వర్గాలు బలప్రదర్శనకు దిగారు. వైసీపీ నేత కారు ధ్వంసం అయింది. గుడివాడలో హైటెన్షన్ క్రియేట్ అయింది. పోలీసులు భారీగా మోహరించారు.
గుడివాడలో ఫ్లెక్సీల కలకలం
గుడివాడలో ఉదయం నుంచే ఫ్లెక్సీల కలకలం చెలరేగింది. సీఎం చంద్రబాబు షూస్ ను మాజీ మంత్రి కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్టు ఫ్లెక్సీలు కట్టారు టీడీపీ వర్గీయులు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే.. ఆయన బూట్లు పాలిష్ చేస్తానంటూ గతంలో నాని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ ను నిలబెట్టుకోవాలంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు, వైసీపీ నేతలు పెట్టిన ఫ్లెక్సీలను టీడీపీ, జనసేన కేడర్ చింపేశారు. అడ్డుకునే క్రమంలో పోలీసులకు, కేడర్‌కు మధ్య తోపులాట జరిగింది.
వైసీపీ వాహనం ధ్వంసం
గుడివాడ, లింగవరంలో కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్‌లో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. కృష్ణా జిల్లా అధ్యక్షుడుగా పేర్ని నాని హాజరు కావాల్సి ఉండగా.. ఆయన రాకపై టీడీపీ మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చీర, గాజులు తీసుకువచ్చి నిరసన తెలిపారు. వైసీపీ మీటింగ్‌కు వస్తున్న ఆ పార్టీకి చెందిన గుడివాడ జెడ్పీటీసీ కుప్పల హారిక వాహనాన్ని టీడీపీ, జనసేన శ్రేణులు అడ్డుకున్నారు. కారు అద్దం పగులకొట్టారు. ఆ వాహనానికి టీడీపీ జెండాను తగిలించారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అతికష్టం మీద కంట్రోల్ చేశారు.
గుడివాడలో హైటెన్షన్
మరోవైపు, నాగవరప్పాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీడీపీ వర్గీయులు భారీ ర్యాలీ చేపట్టారు. కొడాలికి చెందిన K కన్వెన్షన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రయల్నించారు. వైసీపీ శ్రేణులు సైతం భారీగా తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపు చేస్తున్నారు. గుడివాడ నివురుగప్పిన నిప్పులా మారింది.
Also Read : జనసేనను చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది ఇదేనా!