Whatsapp Governance: ఏపీ ప్రభుత్వం సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వచ్చిందే వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ కార్యక్రమం. సుమారు 164 సేవలు వాట్సాప్ ద్వార అందించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ సేవల కోసం ప్రజలెవరూ.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ.. ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం లేకుండా చేసేందుకు ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చామని మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ కార్యక్రమంను మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. పౌరులకు అందించే సేవలను సులభంగా త్వరితగతంగా పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని లోకేష్ ప్రకటించారు. మొదటి విడుదల 161 పౌర సేవలు అందుబాటులోకి రాగా, రెండవ విడతలు 360 పౌర సేవలను ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం అధికారిక వాట్సప్ నెంబర్ 9552300009 ను ప్రభుత్వం కేటాయించింది.
తొలుత వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ ద్వార విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఎంపీసీ, బైపీసీ చదివే విద్యార్థులు తమ హాల్ టికెట్లను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. విద్యార్థులు ఏ విధంగా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నారా లోకేష్ తన ట్వీట్ ద్వారా వివరించారు.
ముందుగా http://bie.ap.gov in వెబ్ సైట్ ను సంప్రదించి కళాశాల లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన మిత్ర, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ వాట్సాప్ సర్వీస్ ను సెలెక్ట్ చేసిన అనంతరం హాల్ టికెట్ నెంబర్ ను లేదా, ఆధార్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసిన వెంటనే ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందంటూ నారా లోకేష్ వివరించారు.
Also Read: Maha Kumbhamela: మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం
పలు ప్రైవేట్ కళాశాలల్లో ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ముందుగా విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సేవలను తీసుకురావడంపై విద్యార్థులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.