Three People died as Car swept away: ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఈ వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాతపడ్డారు. నంబూరులోని ఓ స్కూల్ లో ఉప్పలపాడుకు చెందిన వ్యక్తి విధులు నిర్వహిస్తున్నారు. అయితే, ప్రస్తుతం అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడంతో శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. ఈ క్రమంలో అదే పాఠశాలకు వెళ్లిన ఉప్పలపాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకుని ఆయన స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో వాగులో కారు కొట్టుకుపోయింది. ఈ విషాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల సాయంతో కారుతోపాటు వాగులో కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్ కు వెళ్లి తిరిగి వస్తారనుకుంటే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు బోరన విలపిస్తున్నారు.
Also Read: ఏపీపై కన్నెర్ర చేసిన వరుణుడు.. ఏడుగురు మృతి.. 20 రైళ్లు రద్దు
ఇదిలా ఉంటే.. భారీ వర్షాలకు ఏపీ మొత్తం అతలాకుతలమైతుంది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్థమవుతుంది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది. అలర్ట్ గా ఉండాలంటూ ఏపీ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
భారీగా వర్షాలు కురుస్తుండడంతో విజయవాడలోని మొగల్లాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
Also Read: జగన్‌కు, చంద్రబాబుకు మధ్య తేడా లేదనిపిస్తుంది.. ఎందుకంటే? : షర్మిల సంచలన వ్యాఖ్యలు
అనంతరం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఆయన అధికారులకు సూచించారు. రెండుమూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ చంద్రబాబు సూచించారు. అప్రమత్తతతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చంటూ అధికారులకు సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలన్నారు. పట్టణాల్లో రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతుందని, పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టాలన్నారు. కాల్వలు, వాగులను దాటేందుకు ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయంతో పనిచేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడాలన్నారు. అదేవిధంగా భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపాలన్నారు. జ్వరాల బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలంటూ సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. అదేవిధంగా అధికారుల సూచనలు ప్రజలు పాటించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.