Rashmika Mandanna: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల అవకాశాలు దక్కించుకోవడంతో పాటు హిట్లు కొడుతున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే టక్కున నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరే గుర్తొస్తుంది. ‘యనిమాల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’.. ఇలా వరుస హిట్లు అందుకోవడం మాత్రమే కాదు ఆ హీరోలందరికీ కెరీర్ బెస్ట్ మూవీలుగా కూడా నిలిచాయి. ఈ క్రమంలో పాన్ ఇండియా స్థాయిలో రష్మికకు క్రేజ్‌తో పాటు డిమాండ్ పెరిగింది. దీంతో అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఓ పక్క సైలెంట్‌గా హిట్లు కొడుతూ కెరీర్ పరంగా ఈ అమ్మడు దూసుకుపోతుంటే మరోవైపు పలు కొత్త కొత్త కాంట్రవర్సీలు కూడా ఊహించని విధంగా తననే చుట్టు ముడుతున్నాయి. తాజాగా ఓ మ్యాజిక్ షోలో జరిగిన సంఘటన ఆధారంగా మరోసారి రష్మికపై ట్రోల్స్ మొదలయ్యాయి.
అక్కడే మొదలు
టాలీవుడ్‌లో ‘ఛలో’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందనా (Rashmika Mandanna).. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వచ్చిన ఫేమ్ అండ్ నేమ్‌తో బాలీవుడ్‌లోనూ తన లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ కూడా ‘యానిమల్’ రూపంలో మంచి హిట్ అందుకుంది. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ గతంలో రష్మిక చేసిన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉన్నాయి. కన్నడ సినిమా ‘కిర్రిక్ పార్టీ’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక.. ఆ సినిమా షూటింగ్ సమయంలో అందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ప్రేమతో ఆగిపోకుండా పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. అలా వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కానీ అక్కడే కథ రివర్స్ అయ్యింది. రష్మికకు టాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది.
ఎన్నో కాంట్రవర్సీలు
రష్మిక టాలీవుడ్‌లో అడుగుపెట్టడం, తాను నటించిన సినిమాలు హిట్లు కావడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మరోపక్క రక్షిత్, రష్మిక మధ్య మనస్పర్థలు రావడంతో వారి ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేక్ అయ్యింది. ఈ క్రమంలో కన్నడ పరిశ్రమ కంటే తెలుగుకి దగ్గరయ్యింది ఈ అమ్మడు. దీనికి తోడు అప్పుడప్పుడు కొన్ని ఇంటర్య్వూల్లో రష్మిక చేసిన కామెంట్లు కన్నడ ప్రేక్షకులను ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో అప్పటినుంచి అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో ఏదో ఒకవిధంగా రష్మికను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ‘ఛావా’ చిత్రం విడుదలయ్యి అంత పెద్ద హిట్ అయినా కూడా అందులో మరాఠీ యువరాణి పాత్రకు రష్మిక సెట్ అవ్వలేదని కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా ముగ్గురు మ్యాజిషియన్లు కలిసి స్టేజ్‌పైనే రష్మిక పరువు తీశారు.
Also Read: రెండు డిజాస్టర్ల తర్వాత కూడా పూరి మారలేదు.. మళ్లీ ఛార్మీతోనే మూవీ..
ఇదేం మ్యాజిక్
స్టేజ్‌పై ముగ్గురు మ్యాజిషియన్లు మ్యాజిక్ చేయడానికి వచ్చారు. ముందుగా ఆ ముగ్గురు ‘పుష్ప’లోని రష్మిక పోస్టర్‌ను ప్రేక్షకులకు చూపిస్తారు. అందులో ఒకడు రష్మికను చూసి తెగ మురిసిపోతాడు. అందుకే తనను పక్కకు వెళ్లి నిలబడమని చెప్తారు. అంతలోనే తన దగ్గరకు వెళ్లి తన తలపై చేయి పెట్టి ఏదో ట్రిక్ ప్లే చేస్తాడు మ్యాజిషియన్. ఆపై మూసి ఉన్న రష్మిక ఫోటో దగ్గరకు వెళ్లి అందులో నుండి జుట్టు బయటికి లాగుతాడు. ఆ తర్వాత ఫోటోను ఓపెన్ చేసి చూస్తే రష్మిక గుండుతో కనిపిస్తుంది. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ అయినా కూడా దానికోసం రష్మిక ఫోటో ఉపయోగించడం ఫ్యాన్స్‌కు నచ్చలేదు. తనను అవమానించినట్టుగా ఉందని ఫీలవుతున్నారు.