TTD Latest News: మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్నారా? అయితే ఇక మీకు ఆ ఖర్చు భారం తగ్గినట్లే. అవును ఇప్పటి వరకు కాస్త తిరుమలలో ప్రవేట్ వాహనాల అధిక వసూళ్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎందరో భక్తులకు మేలు చేకూరనుంది.
తిరుమలకు వెళ్లే భక్తులకు ఇక బస్సు కోసం వేచి చూసే రోజులు పోయాయి! టీటీడీ – ఆర్టీసీ సంయుక్తంగా తిరుమలలో ఉచిత బస్సు సేవలను విస్తరించాయి. ఇప్పటివరకు ఉన్న బస్సులే కాకుండా, కొత్తగా మరో డజను బస్సులను రంగంలోకి దించగా, ఆర్టీసీ కూడా అదనంగా తన వంతు సహకారాన్ని అందిస్తూ భక్తుల కోసం 20 బస్సులను మళ్లీ రోడ్డెక్కించింది.
బస్సుల జాతర.. ఎక్కడ చూసినా సేవే
ఇప్పుడేమంటే.. ప్రతి 8 నిమిషాలకు ఒక ఉచిత బస్సు తిరుమలలో అందుబాటులో ఉంటుంది. RTC బస్సులు కూడా లైన్లో ఉన్నాయి. RTC తరఫున ఇచ్చిన 20 బస్సులతో, ప్రతి 6 – 7 నిమిషాలకు ఒక బస్సు భక్తుల కోసం తిరుగుతోంది. మొత్తం రోజుకు 380 ట్రిప్పులు భక్తుల అవసరాల కోసం సిద్ధంగా ఉన్నాయి.
ఇంత తక్కువ గ్యాప్‌లో బస్సులు రావడం వల్ల వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలతో ఉన్న భక్తులకు ఇది గొప్ప ఊరట. అంతేకాదు.. ఇంతకాలంగా ప్రైవేట్ వాహనాలపై అధిక ధరలు చెల్లిస్తూ ప్రయాణించిన భక్తులకు ఇది నిజంగా విముక్తిలాంటి పరిష్కారం. వాహనాల అద్దె, పార్కింగ్ ఫీజులు, కాలుష్యం.. ఇవన్నీ భక్తుడికి ఆర్థిక కష్టాలు తెచ్చిపెడతాయి. కానీ ఇప్పుడు ఉచిత బస్సులు రావడం వల్ల ఆ ఖర్చుల్ని పూర్తిగా తప్పించుకోవచ్చు.
ట్రాఫిక్ తగ్గింపు.. భద్రత పెంపు
ఇతర ప్రయాణికులు కూడా ఇలా ఉచిత బస్సులు ఎక్కితే, రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి, పార్కింగ్ కష్టాలు దూరమవుతాయి, టెంపో, క్యాబ్‌లు వేసే అధిక ఛార్జీలు అన్నీ ఇకనుండి చెరిపేయబడతాయి. భక్తుల ప్రయాణం సురక్షితంగా, సమయసప్తంగా జరుగుతుంది.
Also Read: Bullet Train Project: రెడీ అయింది భారీ వంతెన.. ఇక బుల్లెట్ ట్రైన్ పరుగుకు మార్గం సిద్ధం!
పర్యావరణ హితమైన నిర్ణయం
ఇక ప్రైవేట్ వాహనాల వల్ల కలిగే కాలుష్యం తగ్గేందుకు ఈ ఉచిత బస్సు సేవలు కీలకంగా మారనున్నాయి. భారీగా వాహనాల ప్రవేశం ఉండకపోతే.. పచ్చదనం, ప్రశాంతతతో తిరుమల వైభవం మరింత మెరుగవుతుంది.
RTCకి ప్రత్యేక ధన్యవాదాలు
ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్టీసీకి టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి వెంకయ్య చౌదరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. RTC తరఫున అందిన ఈ 20 బస్సులు భక్తులకు భరోసాగా నిలుస్తున్నాయని అన్నారు.
టికెట్లకు సంబంధించి ముఖ్య గమనిక..
తిరుమల – తిరుపతి మధ్య ప్రయాణించే భక్తులు మాత్రమే టికెట్లు తీసుకోవాలి. తిరుమలలో పర్వతంపై ఉండే అన్ని బస్సులు భక్తులకు ఉచితం. ఇకపై తిరుమలలో భక్తులకు కేవలం దర్శనం మాత్రమే కాదు.. అందుబాటులో ఉండే సేవలూ దివ్యంగా ఉంటాయన్న నమ్మకం. అధిక ధరలకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా, భక్తులు ఉచిత బస్సుల ప్రయోజనాన్ని పొందడమే ఒక గొప్ప మార్పు. ఇది కేవలం సదుపాయం కాదు.. శ్రీవారి సేవలో భాగంగా భావించాలి.