Tirumala Brahmotsavams: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటేనే ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక. మలయప్పను మాఢవీధుల్లో దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది అధికమాసం రావడంతో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఇప్పుడు నవరాత్రి బ్రహ్మత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 12 నుంచి 20వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు వివిధ వాహన సేవలతో పాటు తిరుమలగిరులు గోవింద నామస్మరణతో మార్మోగనుంది.
సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు పేర్లు వేరైనా రెండింటి లక్ష్యం ఒక్కటే. శ్రీవారి వైభవాన్ని చాటడం భక్తులకు స్వామివారి దివ్యదర్శన భాగ్యం కల్పించడమే. ఆగమ సంప్రదాయం ప్రకారం నిర్వహించే కార్యక్రమాల్లో కొన్ని తేడాలుంటాయి. సాలకట్ల బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు కాగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు అధికమాసం సందర్భంగా నిర్వహిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమై పెద్ద రథోత్సవం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. అయితే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఇవేమి ఉండవు. మిగిలిన ప్రధాన వాహన సేవలు, విశేష కార్యక్రమాలు మాత్రం వైభవంగా నిర్వహిస్తారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. గరుడ వాహనంపై మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. స్వర్ణాభరణాలతో అలంకరించిన స్వామివారు గరుడ వాహనంపై తిరుమల మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వడం కనుల పండువగా ఉంటుంది. ఈ ఉత్సవాల్లో పుష్పక విమాన సేవ, స్వర్ణరథోత్సవం, చక్రస్నానం వంటి కార్యక్రమాలు సైతం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. అధికమాసం కారణంగా ఒకే ఏడాదిలో రెండుసార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించే అవకాశం రావడంతో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. మరోసారి తిరుమల కొండపై గోవింద నామస్మరణ మార్మోగనుంది.
Also read: ఏపీలోని బీసీలకు భారీ గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన!