Naatukodi Vellulli Karam: ఆదివారం వచ్చిందంటే చికెన్‌తో ఏదైనా స్పెషల్‌గా చేసుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఎప్పుడూ చేసే చికెన్ కర్రీ, ఫ్రై కాకుండా ఈసారి నాటుకోడితో వెల్లుల్లి కారం ట్రై చేసి చూడండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రతో తయారు చేసిన మసాలా నాటుకోడి ముక్కలకు బాగా పట్టి, ఘాటుగా, రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వేడి వేడి అన్నంలోకి ఈ వేపుడు కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. అయితే నాటుకోడి ముక్కలు మెత్తగా ఉడికి, మసాలా చక్కగా పట్టాలంటే తయారీలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మరి ఇంట్లోనే నోరూరించే నాటుకోడి వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..
నాటుకోడి చికెన్ – అర కిలో
వెల్లుల్లి రెబ్బలు – ఒక పెద్ద కప్పు
కారం – మూడు చెంచాలు
ఎండుమిర్చి – ఆరు
ధనియాలు – రెండు చెంచాలు
జీలకర్ర – ఒక చెంచా
లవంగాలు – నాలుగు
యాలకులు – రెండు
దాచినచెక్క – చిన్న ముక్క
పసుపు – అర చెంచా
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక చెంచా
Also Read: బోటీ కూర అంటే ఇష్టముండదా? చింతచిగురుతో ఇలా చేస్తే ప్లేట్లు నాకేస్తారు!
కరివేపాకు – రెండు రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – ఒక చెంచా
కావాల్సినంత నాటుకోడి ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నాటుకోడి ముక్క త్వరగా ఉడకదు కాబట్టి.. ఒక కుక్కర్‌లో చికెన్ ముక్కలు, కొద్దిగా పసుపు, అర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, అర గ్లాసు నీళ్లు పోసి నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు వేరే పెనంపై ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాచినచెక్క, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి. అవి చల్లారాక అందులో పొట్టు వలచిన వెల్లుల్లి రెబ్బలు, కారం వేసి మిక్సీలో కచ్చాపచ్చాగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వంటకానికి అసలైన రుచిని ఇచ్చే వెల్లుల్లి కారం పొడి.
ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు బంగారం రంగులోకి వచ్చాక మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఆ తర్వాత కుక్కర్‌లో ఉడికించి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను నీళ్లతో సహా కడాయిలో వేసి బాగా కలపాలి. నీళ్లన్నీ ఇంకిపోయి, నూనె పైకి తేలే వరకు మూతపెట్టి సన్నని మంటపై మగ్గనివ్వాలి.
చికెన్ ముక్కలు బాగా వేగి నూనె పైకి తేలుతున్న సమయంలో.. ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారం పొడిని చికెన్‌పై చల్లి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. సన్నని సెగపై మరో ఐదు నిమిషాలు వేయిస్తే వెల్లుల్లి ఘాటు చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. చివరగా కొద్దిగా నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని దించేస్తే ఎంతో రుచికరమైన, ఘాటైన నాటుకోడి వెల్లుల్లి కారం సిద్ధమవుతుంది. దీనిని వేడి వేడి అన్నం లేదా పప్పుచారుతో నంజుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
Also Read: ఫిష్ ప్రియులు ‘కరిమీన్ పొల్లిచాతు’ ఇలా ట్రై చేయండి.. ఈ రుచిని అస్సలు మర్చిలేపోరు!