తిరుమలలో ఉదయం గడియారం 8 కొట్టేలోపే ఒక తాళంచెవి చేతులు మారింది, ఒక ఎమర్జెన్సీ గేట్ తెరుచుకుంది, మధ్యాహ్నానికి రీ ఎంట్రీ ద్వారం వద్ద అసలు సంగతి బయటపడింది. కొద్ది గంటల వ్యవధిలో జరిగిన ఈ స్పెషల్ దర్శనం ఆపరేషన్ చివరకు కీలక మలుపు తిరిగింది. అసలేం జరిగిందంటే..
❂ మోసం జరిగిన తీరు ఇదే!
ఈనెల 23న ఉదయం 2.30 గంటలకు తిరుపతి అలిపిరి వద్ద దేవి కాంప్లెక్స్ దగ్గర SSD దర్శనం టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులను లక్ష్యంగా చేసుకున్నారు ఇద్దరు దళారీలు. వీరు స్థానికంగా ట్యాక్సీ నడుపుకొని జీవనం సాగించేవారు. వారే కె. వెంకటేష్, డి. వెంకటేష్. వీరు క్యూ లైన్‌లో లేకుండా నేరుగా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తామంటూ ప్రతి ఒక్కరితో రూ.1,500 చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్లాన్ ప్రకారం భక్తులను తమ వాహనాల్లో తిరుమలకు తీసుకెళ్లి, అక్కడ ఉన్న మరో దళారి.. వాహన క్లీనర్ వెంకటేష్‌కు రూ.8,500 ఇచ్చారు. ఆ క్లీనర్ TTD ప్రైవేట్ భద్రతా సిబ్బంది (PSG) పి. సాయి కుమార్‌కు రూ.8,000 వాటాగా చెల్లించాడు. దాంతో సాయి కుమార్, VQC-II వద్ద ఉన్న ఎమర్జెన్సీ గేట్ తాళంచెవిని వాహన క్లీనర్ వెంకటేష్‌కు అప్పగించాడు.
❂ ఎలా వెలుగులోకి వచ్చిందంటే?
ఉదయం సుమారు 8.00 గంటల సమయంలో తిరుమలలోని VQC-II ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలో, సబ్‌స్టేషన్ ఎదుట ఉన్న ఎమర్జెన్సీ గేట్‌ను వాహన క్లీనర్ వెంకటేష్ తెరిచాడు. ఆ గేట్ ద్వారా భక్తులను అక్రమంగా లోపలికి పంపించి టోకెన్లు పొందేలా చేశాడు. టోకెన్లు తీసుకున్న వారు బయటకు వచ్చి, తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు రీ ఎంట్రీ ద్వారం ద్వారా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన సమయంలో TTD విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చింది. విచారించగా మొత్తం అసలు విషయం బహిర్గతమైంది.
❂ కేసు నమోదు..
ఈ ఘటనపై TTD విజిలెన్స్ అధికారులు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్స్ కె. వెంకటేష్, డి. వెంకటేష్, వాహన క్లీనర్ వెంకటేష్, TTD PSG పి. సాయి కుమార్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఈ ముఠాలో మరెవరైనా ఉన్నారా? లోపల నుంచి సహకరించిన ఇతరులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read: Indian Railways passengers: వందే భారత్ స్పీడ్.. రైల్వే రికార్డులు బద్దలు.. లెక్క ఎక్కువైంది బాస్!
❂ నమ్మవద్దు.. మోస పోవద్దు!
తిరుమలలో భక్తులు ఇలాంటి దళారీల మాయ మాటలకు లోనుకాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్యూ లైన్ తప్పించి ఉచిత దర్శనం లేదా టోకెన్ అంటూ చెప్పేవారిపై నమ్మకం పెట్టుకోవద్దని, అధికారికంగా TTD ప్రకటించిన టోకెన్ స్లాట్లు, దర్శన విధానాలు మాత్రమే అనుసరించాలని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు, డబ్బు డిమాండ్లు ఉంటే వెంటనే TTD విజిలెన్స్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సంఘటన ఇప్పుడు నాలుగు పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. ఎమర్జెన్సీ గేట్ తాళాలు ఇలా సులభంగా ఎలా బదిలీ అయ్యాయి? అంతర్గత పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయా? ఇలాంటివి ఇంతకు ముందు ఎన్నిసార్లు జరిగి ఉండొచ్చు? సాంకేతిక నిఘా మరింత బలపరచాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తిరుమలలో భక్తుల భద్రత, విశ్వాసం కోసం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవడం అవసరం. TTD ఇప్పటికే గేట్ల భద్రత, యాక్సెస్ కంట్రోల్, విజిలెన్స్ బలపరచడానికి ప్రణాళికలు ప్రారంభించింది. ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు త్వరలోనే దర్యాప్తు సమాధానం చెబుతుందని అధికారులు చెబుతున్నారు.