Tirumala Update: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి పట్టే సమయ వివరాలు
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 59,564 మంది భక్తులు దర్శించుకోగా.. 24,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.18 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
రేపు డయల్ యువర్ ఈవో..
టీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవోకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని టీటీడీ ప్రకటించింది. భక్తులు 0877-2263261 కు సంప్రదించాలని ప్రకటన విడుదలైంది. మరి శ్రీవారి భక్తులు ఏవైనా సమస్యలు ఉంటే, నేరుగా ఈవో దృష్టికి తీసుకెళ్తే సమస్యకు పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
శ్రీవారి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నిర్వహించే అభిషేకం సేవలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, నూతన వధూవరులు పీవీ సింధు, వెంకట దత్త సాయిలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు.