Hudson Meek: కొందరు నటీనటులను గుర్తుపెట్టుకోవాలంటే వారు ఎక్కువగా సినిమాల్లో నటించాల్సిన అసవరం లేదు. ఒక్క సినిమాలో అయినా గుర్తుండిపోయే పాత్ర చేస్తే చాలు.. అలా ‘బేబి డ్రైవర్’ అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హడ్సన్ మీక్ కూడా ఆ ఒక్క సినిమాతో చాలామంది ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోయాడు. అలా చిన్నప్పుడే ఎంతో ఫేమ్ సంపాదించుకున్న హుడ్సన్ 16 ఏళ్లకే కన్నుమూశాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. దీంతో హడ్సన్ మీక్ ఫ్యాన్స్ అంతా తన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. అసలు హడ్సన్ ఎలా మరణించాడు అనే విషయాన్ని హాలీవుడ్ మీడియా వివరించింది.
చిన్న వయసులోనే ఎంతో సాధించాడు
డిసెంబర్ 22న అలాబామాలో హడ్సన్ మీక్‌కు యాక్సిడెంట్ జరిగిందని, అందులో తను మరణించాడని హాలీవుడ్ మీడియో చెప్తోంది. ఆ యాక్సిడెంట్‌లోనే హడ్సన్ మరణించాడనే విషయాన్ని తన కుటుంబ సభ్యులు స్వయంగా ప్రకటించారు. ‘‘హడ్సన్ మీక్ జీసస్‌తో ఉండడానికి వెళ్లిపోయాడని చెప్పడానికి మా మనసులు ముక్కలవుతున్నాయి. తను ఈ భూమి మీద కేవలం 16 ఏళ్లు మాత్రమే ఉన్నాడు. అది చాలా చాలా తక్కువ. కానీ ఈ కొద్ది సమయంలోనే తను ఎంతో సాధించాడు. తను కలిసిన ప్రతీ ఒక్కరికి తను ఎవరో గుర్తుండిపోయేలా చేశాడు’’ అంటూ హడ్సన్ మీక్ మరణ వార్త గురించి తన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ డైరెక్టర్ కన్నుమూత..
బేబి పాత్రతో గుర్తింపు
అలాబామాలోని వెస్టేవియా హిల్స్‌లో గురువారం రాత్రి హడ్సన్ మీక్‌కు యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది. కదులుతున్న వాహనం నుండి కింద పడిపోవడం వల్ల హుడ్సన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు చెప్తున్నారు. గాయాలతో ఉన్న తనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స తీసుకున్న తర్వాత హడ్సన్ మీక్ మృతిచెందాడు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. 2017లో విడుదలయిన ‘బేబి డ్రైవర్’ సినిమాలో బేబి అనే పాత్రలో నటించాడు. హీరోకు చిన్నప్పటి పాత్ర చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
ఎన్నో టీవీ షోలు కూడా
ఎడ్గర్ రైట్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబి డ్రైవర్’ (Baby Driver) సినిమాలో హుడ్సన్ మీక్ (Hudson Meek) పాత్రకు మ్యూజిక్ అంటే, కార్ ఛేజింగ్ అంటే చాలా ఇష్టం. ఇక ‘బేబి డ్రైవర్’ గురించి పక్కన పెడితే.. హుడ్సన్ మీక్ ఎన్నో టీవీ షోల్లో కూడా కనిపించాడు. వెండితెరపై కనిపించే సినిమాలతో మాత్రమే కాకుండా ఇండిపెండెంట్ సినిమాలతో కూడా తను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందాడు. తను పెద్దయిన తర్వాత హీరోగా మారి అందరినీ ఎంటర్‌టైన్ చేశాడని తన తల్లిదండ్రులతో పాటు ఫ్యాన్స్ సైతం ఆశపడ్డారు. కానీ 16 ఏళ్లకే హడ్సన్ అకాల మరణం హాలీవుడ్‌లో విషాద ఛాయలు నెలకొనేలా చేసింది.