Black Magic Cannibalism| జీవితంలో కష్టపడి విజయం సాధించాలి. కానీ కొందరు నిధులు, నక్షత్రాలు, జాతకాలు, క్షుద్రపూజలు అంటూ మూఢనమ్మకాలతో జీవితాలు నాశనం చేసుకుంటారు. తాజాగా ఒక యువకుడు ఏదో మాయ శక్తులు వస్తాయని నమ్మి మూడు హత్యలు చేశాడు. పోలీసులు అతడిని చాలా కష్టపడి అరెస్టు చేశాక.. విచారణలో అతను నరమాంసం తిన్నాడని షాకింగ్ విషయాలు తెలిశాయి.
వివరాల్లోకి వెళితే.. 2021 సంవత్సరం.. అమెకిరా లోని టెక్సాస్ రాష్ట్రం యులెస్ నగరంలో ఒక మోటెల్ (లాడ్జింగ్) లో ఒక వ్యక్తి గదిలో బెడ్ కింద మానవ శరీర భాగాలు లభించాయి. దీంతో లాడ్జింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఆ గదిలో ఉన్న వ్యక్తి గురించి ఆరా తీయగా అతని పేరు జేసన్ థోర్న్ బర్గ్ తెలిసింది. అయితే జేసన్ ఆ సమయంలో లాడ్జింగ్ నుంచి బయటకు వెళ్లాడు. అతను రాగానే పోలీసులు అక్కడ ఉండడం చూసి పారిపోయాడు.
జేసన్ కోసం పోలీసులు గాలించడం మొదలు పెట్టారు చివరికి మూడు నెలల తరువాత అతడిని పట్టుకున్నారు. లాడ్జింగ్ లో లభించిన మానవ శరీర భాగాలు ముగ్గురు వ్యక్తులవని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో లభించింది. దీంతో పోలీసులు జేసన్ పై మూడు హత్యల కేసు నమోదు చేసి ప్రశ్నించారు. అప్పుడు జేసన్ తాను క్షుద్రపూజల కోసం తన ముగ్గురు స్నేహితులను హత్య చేసినట్లు అంగీకరించాడు.
పోలీసుల విచారణలో జేసన్ గతంలో క్షుద్రపూజలు చేసినట్లు తెలిసింది. అతను మే 2021లో మరో స్నేహితుడిని, 2017 సంవత్సరంలో అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో తన ప్రియురాలిని కూడా హత్య చేసి పరారీలో ఉన్నట్లు తెలిసింది. జేసన్ తనకు మాయశక్తులు వస్తాయని.. నమ్మి.. మనుషులకు మత్తు ఇచ్చి వారిని నిర్మానుష ప్రాంతాలకు తీసుకెళ్లి క్షుద్రపూజలు చేసేవాడు. ఆ పూజలలో భాగంగా వారిని హత్య చేసి.. వారి శరీరం నుంచి గుండె బయటకు తీసి తినేవాడినని స్వయంగా జేసన్ అంగీకరించాడు.
జేసన్ పై అయిదు హత్యల కేసులో టర్రాంట్ కౌంటీ కోర్టు గత సంవత్సర కాలం విచారణ చేస్తోంది. ఇటీవల విచారణ పూర్తి అయింది. అయితే విచారణ సమయంలో జేసన్ తరపు న్యాయవాది.. అతనికి మతి స్థిమితం లేదని.. ఇలాంటి వ్యక్తిని చట్టప్రకారం శిక్షించలేమని వాదించాడు. కానీ మృతుల కుటుంబ సభ్యులు జేసన్ కు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇరు వైపులా వాదన విన్న కోర్టు జేసన్ కు మరణ శిక్ష విధించాలా? లేక జీవిత ఖైదు శిక్ష విధించాలా? అన్నది జ్యూరీ సభ్యుల నిర్ణయించాలని చెప్పింది. ఈ కేసులో తుది తీర్పు మరో నెల రోజుల్లో వెలువడనుంది.
మరోవైపు ఇలాంటిదే ఒక కేసు పాకిస్తాన్ లో జరిగింది. పాకిస్తాన్ లోని లాహోర్ నగరం దాస్కా ప్రాంతంలో ఒక యువతి శరీరం ముక్కులు ఒక గోనె సంచిలో లభించాయి. అయితే చనిపోయిన యువతిని పోలీసులు గుర్తించారు. మృతురాలు సగ్ర బీబి కోడలు అని తెలిసింది. దీంతో పోలీసులు సుగ్ర బీబిని అరెస్టు చేశారు. మృతురాలి భర్త దుబాయ్ లో ఉద్యోగ రీత్యా నివసిస్తున్నాడు. అయితే అతను తన సంపాదనని తన భార్యకు పంపించేవాడు. కానీ ఆమె క్షుద్రపూజలు చేస్తోందని ఆమె అత్త సుగ్ర బీబి ప్రచారం చేసింది. ఇటీవల ఒక రోజు రాత్రి ఆమె నిద్రపోతుండగా.. కోడలి ముఖంపై అత్త సుగ్ర బీబి దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తరువాత ఆమె శరీరాన్ని ముక్కలు చేసి ఒక సంచిలో నింపి ఊరి బయట పడేసింది. ఈ నేరంలో సుగ్రబీబితో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు.
పోలీసులు గట్టిగా ప్రశ్నించేసరికి సుగ్ర బీబి నిజం చెప్పేసింది. తన కొడుకు దుబాయ్ లో ఉండి సంపాదన మొత్తం కోడలికి పంపించేవాడని.. తన కొడుకును తనకు దూరం చేసిందనే కోపంలో హత్య చేశానని అంగీకరించింది.