TTD Update: తిరుమల శ్రీవారి అన్న ప్రసాదంలో పలు మార్పులకు టిటిడి శ్రీకారం చుట్టింది. మరింత రుచికరంగా అన్న ప్రసాదాన్ని అందించేందుకు టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం బృహత్తర కార్యక్రమాన్ని చైర్మన్ ప్రారంభించారు. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలను అందించేందుకు ఈ మార్పు చేసినట్లు చైర్మన్ తెలిపారు.
కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలిసిన తిరుమలకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం భక్తుల సౌకర్యార్థం శ్రీవారి అన్న ప్రసాద కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో లడ్డు ప్రసాదం ను ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తారు. అంతే పవిత్రంగా శ్రీవారి అన్న ప్రసాదాన్ని సైతం స్వీకరిస్తారు. శ్రీవారి అన్నప్రసాదానికి సంబంధించి టిటిడి చైర్మన్‌గా బి ఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి పలు మార్పులను చేపట్టారు. భక్తుల నుండి సూచనలు సలహాలను స్వీకరిస్తూ రుచికరమైన అన్న ప్రసాదాన్ని అందించేందుకు టిటిడి ఎంతగానో ప్రయత్నిస్తుంది. అందుకే గురువారం అన్నప్రసాదంలో గారెలను అందించేందుకు టిటిడి శ్రీకారం చుట్టింది.
తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు శనగపప్పు గారెల వడ్డింపు కార్యక్రమాన్ని గురువారం టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు ప్రారంభించారు. ముందుగా గారెలను స్వామి అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా గారెలను చైర్మన్, ఈవో వడ్డించారు. గారెలు భుజించిన భక్తులు ఎంతో రుచిగా కమ్మగా ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు.
గారెల వడ్డింపు కార్యక్రమం అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్న ప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన కలిగిందన్నారు.. తన ఆలోచనను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో గారెలను వడ్డించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలను టిటిడి అందిస్తుందని చైర్మన్ తెలిపారు ఉదయం 10:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తామన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యమైన శ్రీవారి అన్నప్రసాదాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. మరి మీరు తిరుమల కి వెళ్తున్నారా తప్పక శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించండి.. శనగపప్పు గారె రుచి చూడండి.
ఇక,
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సం కీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత, సాహిత్య విద్వాంసులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 46వ వర్ధంతి కార్యక్రమం మార్చి 11న టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పిజి కళాశాల ప్రాంగణంలోని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు, హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటలకు సాహితీ సదస్సు ప్రారంభం కానుంది.
Also Read: Horoscope Today March 6th: ఆ రాశి వారు ఇవాళ చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది
శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామంలో 1893, జనవరి 23న జన్మించారు. మైసూరు మహారాజ కళాశాలలో 38 సంవత్సరాలు తెలుగు ఆచార్యులుగా సేవలందించారు. రేడియోకు ‘‘ఆకాశవాణి’’ అని పేరు పెట్టింది వీరే. వీరి ప్రతిభను గుర్తించి అప్పటి టీటీడీ ఈవో శ్రీ చెలికాని అన్నారావు 1949లో శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ బాధ్యతలను అప్పగించారు. అప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని తాళ్లపాక అరలోంచి వెలుగుచూసిన సంకీర్తనలను పరిష్కరించే బాధ్యతను వారికి అప్పగించారు. సంకీర్తనలను రాగి రేకుల నుండి పరిష్కరించి గ్రంథస్తం చేయడంతోపాటు కొన్ని వందల సంకీర్తనలను ఆయన స్వరపరిచారు. శ్రీఅనంతకృష్ణశర్మను 1979, మార్చి 11న టిటిడి ఆస్థాన విద్వాంసులుగా నియమించారు.