Tirumala News: తిరుమల వచ్చే భక్తులకు సూచన. మంగళ, బుధవారాల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు వీఐపీ బ్రేక్ దర్శనాలుంటాయి. సిఫారసు లేఖలు స్వీకరించబడవని వెల్లడించింది టీటీడీ. జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం సందర్భంగా కారణంగా వాటిని రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
తిరుమలలో రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వెంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ సెలవుల కారణంగా భక్తుల రద్దీ అమాంతంగా పెరిగింది. శనివారం ఒక్కరోజు ఏకంగా 92 వేల భక్తులు స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, నారాయణగిరి షెడ్లు భక్తులతో కిటకిటలాడాయి. క్యూలైన్లు రెండు కిలోమీటర్ల మేరా ఏర్పడింది.
ఈ రద్దీ కారణంగా దర్శన సమయం మరింత పెరిగే అవకాశం ఉంది.సర్వదర్శనానికి 16 గంటలు సమయం పడుతోంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు దొరక్క తిరుపతిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం స్వామని 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీకి 4.43 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటలు సమయం పడుతోంది.
తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. జులై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం జరగనుంది. జులై 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం కార్యక్రమం జరగనుంది. ఈ కారణంగా ఈ రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు రద్దు చేసింది. జులై 14, 15న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని పేర్కొంది.
ALSO READ: ఎయిర్ పోర్టు ఎఫెక్ట్.. ఉత్తరాంధ్ర ఎలా మారనుంది?
తిరుమలలో ఏడాదికి నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తోంది టీటీడీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆలయ శుద్ధి కార్యక్రమం ఉంటుంది. ఉదయం 6 గంటలకు తిరుమంజనం కార్యక్రమం మొదలవుతుంది. దాదాపు 5 గంటల పాటు జరుగుతుంది. ఆ తర్వాత స్వామికి ఆగమోక్తంగా పూజలు చేస్తారు.
మధ్యాహ్నం 12 గంటల నుండి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఆణివార ఆస్థానం సందర్భంగా జూలై 16న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు అయ్యాయి. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళ పాద పద్మారాధన సేవను రద్దు చేసింది.
ప్రతీ ఏడాది దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతికి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తమిళులకు వారి కాలమానం ప్రకారం ఆణిమాసం చివరిరోజు ఉండనుంది. అందుకే దీనిని ఆణివార ఆస్థానం అంటారు. పూర్వం.. మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు కావడంతో ఆణివార ఆస్థానం రోజు. టీటీడీకి సంబంధించి ఆదాయ వ్యయాలు, నిల్వలకు సంబంధించి లెక్కలు మొదలయ్యేవి.
అయితే ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత ఆ పద్దతిని మార్చి-ఏప్రిల్ మధ్యకు మార్చారు. ఈ ఉత్సవం రోజు ఉదయం బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో శ్రీ మలయప్పస్వామివారు కొలువు దీరుతారు. స్వామివారు ఉభయ దేవేరులతో, గరుత్మంతునికి అభిముఖంగా ఉంటారు.
మరో పీఠంపై సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీవిష్వక్సేనులవారు దక్షిణాభి ముఖంగా ఉంటారు. ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించవలసినదిగా భక్తులకు విజ్ఞప్తి చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.