Jyothika Visits Tirumala: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 64,525 మంది భక్తులు దర్శించుకోగా.. 19,880 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.53 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి వచ్చే భక్తులు నేరుగా శ్రీవారిని దర్శించే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న ప్రముఖ సినీ నటి జ్యోతిక
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రముఖ సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన జ్యోతికకు శ్రీవారి చిత్రపటం జ్ఞాపికను అభిమానులు అందజేశారు. జ్యోతికతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. అలా సెల్ఫీ అడిగిన ప్రతి ఒక్కరికీ సెల్ఫీ ఇవ్వడంతో అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అలాగే సాంప్రదాయ వస్త్రధారణలో జ్యోతిక దర్శనానికి రాగా, అభిమానులు దటీజ్ హీరో సూర్య ఫ్యామిలీ అంటూ ముచ్చటించారు. అలాగే మీడియాతో మాట్లాడేందుకు విముఖత చూపారు.