Ugadi Festival: తెలుగు వారి తొలి పండుగ ఉగాది. ఈ రోజు నుంచి తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరం మొదలుకాబోతుంది. విశ్వావసు నామ సంవత్సరానికి స్వాగతం పలుకున్న ప్రజలు శుభవార్త. చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వచ్చే ఈ పర్వ దినానికి చాలా ప్రత్యేకత ఉంది. నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని శాంతులు జరిపించుకొని ముందుకు అడుగులు వేస్తారు ప్రజలు. ఈ నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి డీటేల్స్‌లోకి వెళ్తే..
సృష్టితో మొదలు
చైత్ర శుద్ధ పాడ్యమి కొత్త సంవత్సరానికి ఆరంభం. బ్రహ్మ దేవుడు ఉగాది రోజున సృష్టిని ప్రారంభించడంతో కల్పానికి ఆది తిథి అని కూడా గ్రంథాలు చెబుతున్నాయి. యుగానికి మొదటిది కనుక దీన్ని యుగాది చెబుతున్నారు. ఉగముకు ఉన్న అర్థాల్లో సంవత్సరం కూడా ఒకటి. ఉగములో తొలి మాసం మొదటి రోజు కావడంతో ఇది ఉగాది అయ్యిందని చెబుతున్నారు. చాలామంది రకరకాలుగా చెబుతారు కూడా.
వసంత రుతువు కూడా
ఉగాది రోజుల బ్రాహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయడం, నూతన వస్త్రాలు ధరించి, దేవతారాధన ఇందులో ప్రధానం. విఘ్నేశ్వరుడు, సరస్వతి, గురువులను, పూజించి ప్రసాదాన్ని స్వీకరించడమే ఉగాది స్పెషల్. ఆ ప్రసాదంలో వేప పూత, బెల్లం, మామిడి ముక్కలు, నెయ్యి కలిపి భగవంతుడికి నివేదించిన తర్వాత స్వీకరించాలి. వసంత రుతువు ఈ రోజు నుంచే కావడంతో నూతన జీవితానికి నాందిగా ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు.
విశ్వావసు 39వది
తెలుగు నెలలో ప్రభవ నుంచి వచ్చే అరవై సంవత్సరాల్లో విశ్వావసు నామ సంవత్సరం 39వది. ఈ నామానికి సమస్తమైన సంపదల స్వరూపం అనే అర్థం కూడా వస్తుంది. ఇంకా లోతుల్లోకి వెళ్తే.. సూర్యుడి శక్తి విశేషాలను ఈ నామాలుగా కొందరు చెబుతారు. ప్రకృతి సంపదలు అంతా సౌరశక్తి వల్ల వస్తాయని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. మన సత్సం కల్పాలు, సద్భావనలు, సదాచరణలు బలంగా ఉంటే అన్ని భాగాలు శుభంగానే ఉంటాయి.
ALSO READ: ఆ రెండు తప్ప ఇంకేమీ ఫ్రీగా ఇవ్వొద్దు
కాలాన్ని గౌరవించడం అలవాటుగా చేసుకుంటే కాలనియామకుడు ఈశ్వరుడు అన్నీ అనుకూలిస్తారని అంటారు. ఉగాదికి మరో విశేషత పంచాంగ శ్రవణం. ఈ ఏడాది ఎలా ఉండబోతోంది తెలుసుకునేందుకు చాలా మంది పంచాంగాన్ని ఉగాది రోజు వింటారు. అలా ఏడాది గురించి తెలియ జేసేది కాబట్టి పంచాంగం అని అంటారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా
కేవలం తెలుగు ప్రజలు మాత్రమే కాకుండా మరాఠీలు-గుడిపడ్వాగా, తమిళులు-పుత్తాండు, మలయాళీలు-విషు, సిక్కులు-వైశాఖీగా, బెంగాలీలు-పోయ్ లా బైశాఖ్ పేరుతో పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజు ముందుగా గుర్తుకు వచ్చేది షడ్రుచుల ఉగాది పచ్చడి. ఈ పచ్చడి జీవితంలో జరిగే రకరకాల అనుభవాలను తెలియజేస్తుంది.
పచ్చడి ప్రాముఖ్యత
బెల్లం అనేది తీపి, ఆనందానికి ప్రతీకగా చెబుతారు. ఉప్పు అనేది జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం వివరిస్తారు. ఇక వేప పువ్వు అనేది చేదు, భాధ కలిగించే అనుభవాలు లేకపోలేదు. ఇక చింతపండు విషయానికొస్తే పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు గుర్తు చేస్తోంది. పచ్చి మామిడి అనేది వగరు, కొత్త సవాళ్లు చూపిస్తుంది. కారం అనేది సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు. వీటి సమ్మేళనమే ఉగాది పచ్చడి.