Vaikunta Ekadasi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తుతున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తారు. ఆలయాలను తెరచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరాద్వార దర్శనం కల్పిస్తున్నారు.
తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4.30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. భద్రాచలంలో సరిగ్గా ఉదయం 5 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. యాదగిరిగుట్టలో ఉదయం 5.15 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. గరుడ వాహనంపై వాసుదేవుడి రూపంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ స్వామివారికి గరుడు సేవత్సవం, తిరువీధిసేవ నిర్వహించనున్నారు.
వైకుంఠ ఏకాదశి వేళ ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కిటకిటతో సందడి మొదలైంది. ఉత్తర ద్వార దర్శనం కోసం వేకువ జాము నుంచి భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. ఉత్తర ద్వారాన్ని పచ్చి పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు ఆలయ సిబ్బంది. గోవింద స్వాముల ప్రత్యేక దర్శనం కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఆలయ అధికారులు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వేకువజాము అభిషేకం, అలంకారం, తోమాల, అర్చన, నైవేద్యం నిర్వహించి 4.30 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. నేటి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉండనుంది. ఉత్తర వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే టోకెన్లు ఉన్నవారికి మాత్రమే ఈ పది రోజులు స్వామివారిని దర్శించుకునే వీలు ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read: రాహువు నక్షత్ర మార్పు.. జనవరి 12 నుండి వీరికి డబ్బే.. డబ్బు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భారీ రద్దీ కనిపిస్తోంది. మరోవైపు గోవింద నామస్మరణలో తిరుమల కొండ మారుమోగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 11 వరకు…స్వర్ణరథంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 వరకు స్వర్ణ రథం ఉండనుంది. రేపు ఉదయం 5-30 గంటలకు చక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు అర్చకులు. తిరుపతిలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని స్థానికేతరులెవ్వరూ తిరుమలలోని టోకెన్ల జారీ కౌంటర్ వద్దకు రాకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఆలయ అధికారులు. ఇక, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలు కనువిందు చేస్తున్నాయి.