Khalistani Hardeep Singh Nijjar| కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అయిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య 2023లో జరిగింది. ఈ ఘటనతో కెనెడా, భారత్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందని కెనెడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పలుమార్లు ఆరోపణలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న టొరంటో పోలీసులు గత ఏడాది నలుగురు భారతీయులను నిందితులుగా పేర్కొంటూ అరెస్టు చేశారు. తాజాగా వారికి కెనెడా కోర్టు బెయిల్ మంజూరు చేయబడింది.
నిజ్జర్ హత్య కేసులో ఫస్ట్ డిగ్రీ అభియోగాలతో కరణ్ బ్రార్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ ప్రీత్ సింగ్, 2023 మే నెలలో కెనెడా పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల తరువాత అమర్ దీప్ సింగ్ (22) అనే యువకుడిని నాలుగో నిందితుడిగా అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురు ఎడ్మంటన్ ప్రాంతంలో నివసిస్తుండగా, అమర్ దీప్ బ్రాంప్టన్‌కి చెందినవాడు.
గత కొన్ని నెలలుగా జైల్లో ఉన్న వీరికి కెనడాలోని దిగువ కోర్టు గరువారం జనవరి 9, 2025న బెయిల్ మంజూరు చేసింది. అయితే క్రింది కోర్టు ఈ కేసు విచారణను బ్రిటీష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేసిందని సమాచారం. నిజ్జర్ హత్య కేసులో తదుపరి విచారణ 2025 ఫిబ్రవరి 11న జరగనుంది.
Also Read : చినిగిన షర్టు ముక్కతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు.. సినిమా కాదు రియల్!
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఒక గురుద్వార బయట హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ అప్పట్లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో చేయడంతో భారత ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించి, వాటిని సమర్థించే ఆధారాలు ఇవ్వాలని, ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పింది.
అయినప్పటికీ కెనెడా ప్రభుత్వం ఆధారాలు చూపకుండానే ఆరోపణలను చేస్తూనే ఉంది. ఈ క్రమంలో, నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, సంజయ్ వర్మ సహా కెనడాలోని భారత దౌత్యవేత్తలను భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది. అలాగే, ఢిల్లీలోని కెనెడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగా, ఒట్టావా కూడా భారత దౌత్యవేత్తలపై బహిష్కరణ వేటు వేసింది.
మరోవైపు కెనెడాలో అధికారంలో ఉన్న లిబరల్ పార్టీ పార్లమెంటులో క్రమంగా బలం కోల్పోతోంది. దీంతో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ పరిణామాలతో ఆయన కొన్ని రోజుల క్రితమే ప్రధాని పదవికి రాజీనామా చేసి.. తాత్కాలిక ప్రధాన మంత్రిగా కొనసాగుతున్నారు.