Vidadala Rajini : విడదల రజినీ వర్సెస్ సీఐ సుబ్బారాయుడు. నడి రోడ్డుపై ఓ రేంజ్‌లో జరిగింది గొడవ. సీఐ ఎక్కడా తగ్గలేదు. రజినీ ఏమాత్రం ఆగలేదు. మాటలకు మాట. కౌంటర్‌కు కౌంటర్. గత శనివారం జరిగిన జగడానికి సంబంధించి కొత్త వీడియో బయటకు వచ్చింది. అది లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో, సీఐపై మాజీ మంత్రి రజినీ రెచ్చిపోయారు. సీఐ గారు అంటూనే బెదిరింపులకు దిగారు. మేడమ్ మేడమ్ అంటూ ఆ సీఐ ఎంతగా నచ్చచెబుతున్నా వినకుండా.. విడదల వీరంగం వేశారు.
సీఐపై రజినీ రౌడీయిజం..
మాజీ మంత్రి విడుదల రజనీ, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడుకు జరిగిన వివాదంలో మరో వీడియో బయటకు వచ్చింది. ఆమె అనుచరుడైన శ్రీకాంత్‌రెడ్డిపై కేసు ఉందని.. అతన్ని తీసుకెళ్లేందుకు వచ్చామంటూ సీఐ చెప్తున్నా… ఆయనతో వాగ్వాదానికి దిగారు విడదల రజినీ. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారామె. కారును తాకొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఏం కేసు? ఏ ముద్దాయి? కేసు లేదు, ఏం లేదు.. పక్కకి జరగండి అంటూ దబాయించారు. సీఐ గారు ఇది పద్దతి కాదంటూ బెదిరించారు. నా కారు ఆపడానికి మీరెవరు? ఏం రౌడీయిజం చేస్తున్నారా? అంటూ సీఐ మీద నోరు పారేసుకున్నారు రజినీ.
సీఐ సైతం తగ్గేదేలే..
రజినీ ఎంత రెచ్చిపోతున్నా.. సీఐ సుబ్బారాయుడు సైతం ఏమాత్రం తగ్గలేదు. శ్రీకాంత్‌రెడ్డిపై కేసు ఉందని.. అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. సీఐ ఎంతగా చెబుతున్నా రజినీ అస్సలు వినలేదు. ముద్దాయిని తీసుకుని తిరగొద్దు.. అతనిపై కంప్లైంట్ ఉంది.. కేసు కట్టాం.. అని తేల్చి చెప్పారు. మేడమ్ గారు వాడిని మాత్రం వదిలపెట్టం.. వాడిని తీసుకెళ్లాల్సిందే.. మీరు డోర్ ఓపెన్ చేయండి.. అంటూ మాజీ మంత్రితో సీఐ అనడం ఆ వీడియోలో ఉంది. కారును బలవంతంగా మూవ్ చేసేందుకు రజినీ ప్రయత్నించారు. కానీ, పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ కారును కదలనీయకుండా అడ్డుకున్నారు. మీ ఎమ్మెల్యే ఇంటికొస్తా పదండి అంటూ సీఐపై దౌర్జన్యానికి దిగారు విడదల రజినీ. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : వంశీ ఇవాళో, రేపో అన్నట్టుగా..
అసలేం జరిగిందంటే..
గతవారం నాదెండ్ల మండలం మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు మాజీ మంత్రి విడదల రజినీ. ఆమెతో పాటు కారులో ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ కూడా ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా.. తీవ్ర వాగ్వాదం జరిగింది. కారు డోరును నెడుతూ.. సీఐ మీదకు దూసుకెళ్లారు రజినీ. పోలీసులు సైతం అంతే దూకుడుగా వ్యవహరించి.. బలవంతంగా కారు డోర్ ఓపెన్ చేసి శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు సీఐ సుబ్బారాయుడు. ఆ క్రమంలో రజినీకి, సీఐ సుబ్బారాయుడికి మధ్య జరిగిన గలాటాకు సంబంధించి పలు వీడియోలు వైరల్ అయ్యాయి. లేటెస్ట్‌గా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.