Tirumala Laddu Adulteration: ఏపీలో రాజకీయాల్లోకి కొత్త విషయాలు తెరపైకి విజయసాయిరెడ్డి తెస్తున్నారా? టీడీపీ-వైసీపీని టార్గెట్ చేస్తూ పెట్టబోయే పార్టీకి మైలేజీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఈ క్రమంలో ఏ ప్రాంతానికి తగినట్టుగా ఆయన మాటలు ఆడుతున్నారా? మరి తిరుపతి మీడియా సమావేశంలో ఏం చెప్పారు? తిరుమల లడ్డూ కల్తీ నిజమేనన్న ఆయన, జంతు కొవ్వు కాదని ఎందుకున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
విజయసాయిరెడ్డి తన మార్క్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఈ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టారు. తొలుత విజయవాడ మీడియా సమావేశంలో రాజధానికి అనుకూలమన్నారు. విశాఖలో మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాటలు ఆడారని, ఆ ప్రాంత ప్రజలకు వైసీపీకి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు తిరుపతి వంతైంది. తిరుమల లడ్డూలో కల్తీ నిజమేనని, కాకపోతే జంతువుల కొవ్వులేదని అంటున్నారు. అది సంబద్దమైన ఆరోపణ అని, ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. విచారణలో అదే తేలిందన్నారు.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడమంటే సాధారణ విషయం కాదన్నారు. అలా చెబుతూ లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమే, కానీ జంతు కొవ్వు కలపలేదన్నారు. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు వాడుకున్నారని తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కిలో రూ.320 నుంచి రూ. 411 లకు కొనుగోలు చేశారన్నారు. ఇవాళ మార్కెట్ లో కల్తీ లేని నెయ్యి కొనుగోలు చేయాలంటే రూ. 1000 పైగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో రూ. 658 వరకు కొనుగోలు చేస్తున్నారని, అది స్వచ్చమైన నెయ్యా అంటూ ప్రశ్నించారు. ఇంత తక్కువ ధరకు ఎవరు ఇస్తున్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.
ALSO READ: ఇద్దరు అధినేతల నుంచి సంకేతాలు.. ఫుల్‌జోష్‌లో వంగవీటి రాధా, నాలుగు దశాబ్దాల యుద్ధం ఖాయమా?
సీఎం చంద్రబాబుకు అనుబంధ సంస్థ, మీ బ్రాండ్ ఉపయోగించుకున్న ఇందాపూర్ డైయిరీ నుంచి మీ నెయ్యిని ఎలా కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. అదే సమయంలో మరొక పాయింట్ రైజ్ చేశారు విజయసాయిరెడ్డి. హిందువులను విడదీసి రాజకీయాలు చేస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు. చంద్రబాబు కులాన్ని ఉపయోగించుకుంటే, జగన్ మతాన్ని ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు. హిందువులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే.. జగన్ తన పేరు చివర రెడ్డి తగిలించుకుని రెడ్డి సామాజిక వర్గాన్ని, క్రిస్టియన్, మైనార్టీ వర్గాలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారని ఆరోపించారు.