Ketireddy Peddareddy: ఏపీలోని తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన హత్యకు జేసీ కుటుంబం కుట్ర పన్నిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దారెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాడిపత్రిలోని తన నివాసంపై దాదాపు 500 మందితో దాడి చేయించారని కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. తనను అంతమొందించాలనే ఉద్దేశంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ఈ దాడికి కుట్ర పన్నారని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా జేసీ వర్గీయులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ ఘటనలో పోలీసుల వైఖరిని కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తాడిపత్రి డీఎస్పీ చంద్రశేఖర్.. జేసీ ప్రభాకర్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. దాడి సమయంలో తమ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేస్తే.. డీఎస్పీ వాటిని సాధారణ క్రాకర్స్ (టపాసులు) అని పేర్కొంటూ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని పెద్దారెడ్డి ఆరోపించారు.
జేసీ వర్గీయులు దాడులకు పాల్పడితే.. బాధితులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైనే తిరిగి అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమని పెద్దారెడ్డి అన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలా తమ పార్టీ వారిని వేధింపులకు గురిచేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
Also Read: కెనడాలో దారుణం.. భారత సంతతి జంటపై కాల్పులు.. టార్గెట్ చేసి మరీ లేపేశారు!
అధికార బలంతో చేస్తున్న అరాచకాలకు ఎప్పటికైనా కర్మ ఫలితం అనుభవించక తప్పదన్న విషయాన్ని జేసీ కుటుంబం గుర్తించాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. జేసీ కుటుంబ అరాచకాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు.