Vijayawada Tragedy: విజయవాడలో వినాయక చవితి పండుగ వేళ అత్యంత విషాదకర ఘటన వెలుగుచూసింది. పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాల్సిన సమయంలో చోటుచేసుకున్న ఓ చిన్న ప్రమాదం ఒకరి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రమాదం జరిగిన తీరు
చిట్టినగర్ ప్రాంతానికి చెందిన సుజాత అనే మహిళ సెప్టెంబర్ 20 ఆదివారం రోజున స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వంట పనుల్లో సహాయం అందిస్తున్నారు. ఆ సమయంలో అన్నదానానికి సిద్ధం చేసిన వేడి వేడి సాంబార్ గిన్నెను కిందకు దించుతుండగా.. అనుకోకుండా అదుపుతప్పి ఆ వేడి తొట్టిలోనే పడిపోయారు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయ్యారు.
Also Read: కాంగ్రెస్ సర్కార్‌కు BRS బిగ్ షాక్.. జూరాల నుంచి మొదలయ్యే ఆ బిగ్ ప్లాన్ ఏంటి?
చికిత్స పొందుతూ మృతి
విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూసింది. ఈ ఘోర ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.