BRS Agitation: స్వేచ్ఛ బ్యూరో: ప్రాజెక్టులనే పోరాట వేదికలుగా మార్చేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. సాగునీరు, విద్యుత్ సమస్యలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సాగునీటి సమస్యలపై రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్.. ఇక ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను పరిశీలించడం, రైతులతో సభలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉద్యమాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై ప్రజా ఉద్యమానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం పెద్దఎత్తున ఆందోళన చేపట్టాలని పార్టీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది.
జూరాలే తొలి కేంద్రం?
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిణామాలు బీఆర్‌ఎస్ కార్యాచరణకు మరింత ఊతమిచ్చాయి. సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగగా.. వారితో కలిసి ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకోవడంతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను గృహనిర్బంధించారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 9 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నప్పటికీ ఆయకట్టుకు నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూరాల సమస్యను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. త్వరలో కేటీఆర్ జూరాల ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. రైతులతో కలిసి ప్రాజెక్టు వద్దే పరిస్థితులను పరిశీలించి, అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నిలదీయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది.
సాగర్ నుంచి సింగూరు వరకు..
జూరాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులన్నింటినీ బీఆర్‌ఎస్ నేతలు టార్గెట్ చేయనున్నారు. నాగార్జునసాగర్, సింగూరు, డిండి, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, లోయర్ మానేరు, మిడ్ మానేరు, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల వద్దకు నేతలను పంపించి స్థానిక సమస్యలను గుర్తించాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలపై ఇప్పటికే కేటీఆర్ ప్రభుత్వానికి గడువు విధించారు. స్పందన లేకుంటే కోదాడ నుంచి హాలియా వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేపడతామని ఆయన ప్రకటించారు. దీంతో ప్రాజెక్టుల వారీగా సమస్యలను పట్టుకుని స్థానిక రైతులను ఉద్యమంలో భాగస్వాములను చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నీళ్లు.. కరెంట్.. రైతులే కేంద్రంగా
సాగునీటితోపాటు వ్యవసాయ విద్యుత్ సరఫరా అంశాన్ని కూడా బీఆర్‌ఎస్ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇటీవల పాలమూరు ప్రాంత నేతలతో పాటు రైతులతోనూవిద్యుత్ కోతలు, లో-వోల్టేజీ, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలను అడిగితెలుసుకున్నట్లు సమాచారం. యాదాద్రి-భువనగిరి జిల్లాలోనూ రైతులకు విద్యుత్ సరఫరాపై మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నల్లగొండ ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి రైతులతో కలిసి సమస్యను లేవనెత్తారు. దీంతో నీరు, విద్యుత్ అంశాలను రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మలచాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఇక నుంచి ఈ అంశాలను ప్రాజెక్టుల సమస్యలతో హామీలు, గ్యారెంటీల వైఫల్యాలను ముడిపెట్టి ప్రజల్లోకి వెళ్లాలన్నది బీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. ‘నీళ్లు ఇవ్వాలి.. కరెంట్ ఇవ్వాలి.. హామీలు అమలు చేయాలి’ అనే అంశాలతో ప్రభుత్వాన్ని ఒకేసారి నిలదీయాలని పార్టీ ప్రయత్నిస్తోంది.
రైతులే ఉద్యమ బలం
బీఆర్‌ఎస్ ప్రతిపాదిస్తున్న కార్యక్రమాల్లో రైతులను ప్రధాన భాగస్వాములుగా చేయాలని భావిస్తోంది. ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల్లో రైతు సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి.. నీటి విడుదల, విద్యుత్ సరఫరా, పంటల పరిస్థితిపై స్థానిక సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా..?
జూరాల వద్ద సోమవారం చోటుచేసుకున్న పరిణామాలు ఈ కార్యాచరణకు తొలి పరీక్షగా మారాయి. అక్కడి నుంచి నాగార్జునసాగర్, సింగూరు, డిండి, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల వరకు కార్యక్రమాలను విస్తరించగలిగితే.. సాగునీరు, విద్యుత్ అంశాలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రధాన చర్చగా మారనున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం కూడా నీటి విడుదల, విద్యుత్ సరఫరాపై తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీలు
ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీలు ప్రారంభించారు. తెలంగాణ భవన్ లో సోమవారం అందుబాటులో ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. హరీష్ రావుతో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజయ్య, పువ్వాడ అజయ్ కుమార్ తోపాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రాధానంగా సాగునీరు, విద్యుత్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎన్నిక, కాంగ్రెస్ పార్టీ ఫాం హౌజ్ పరిశీలన, జన్వాడ ఘటనలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమచారం. మంగళవారం కూడా భవన్ లో రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు చేసినవారితో పాటు ఉమ్మడి జిల్లాల్లోని కీలక నేతలతో ప్రత్యేకంగా కేటీఆర్ సమావేశమవుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, తాజా రాజకీయాలు, ఎన్నికలు, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎలా ఎండగట్టాలనేదానిపై కార్యచరణ రూపొందించి ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాస్ సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం.
Also Read: డీఎస్సీ స్కామ్‌లో బాబు, లోకేష్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు: వైఎస్ జగన్