Dasara 2025: దసరా నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి సుందరంగా ముస్తాబైంది. రేపటి(సెప్టెంబర్ 22) నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజులు పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలను మొత్తం 11 రోజులు జరుపుకోనున్నారు. ఇంద్రకీలాద్రిపై 11 రోజుల పాటు దుర్గమ్మ 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి అలంకరణ షెడ్యూల్ ను ఆలయ ఈవో విడుదల చేశారు.
నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:30 గంటలకు పూర్ణాహుతితో ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 29న మూల నక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది తిధుల ప్రకారం 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 11వ అవతారం కాత్యాయని దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. దర్శనాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వీఐపీ, వీవీఐపీ భక్తులకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శన సమయం కేటాయించారు. ఈ దసరా ఉత్సవాల నేపథ్యంలో రూ. 500 టికెట్లు రద్దు చేసి కేవలం రూ. 300, రూ. 100 దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు.
Also Read: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్
వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలకు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. క్లూ లైన్ లో భక్తులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. దసరా ఉత్సవాలకు 5000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ నిర్వహించనున్నారు. 500 సీసీ కెమెరాలు, 25 డ్రోన్స్ తో ఉత్సవాలను పర్యవేక్షించనున్నట్లు ఈవో తెలిపారు. భక్తుల వాహనాల కోసం 12 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.