Vijayawada Tragedy: విజయవాడ నగరంలో శనివరం తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిపై అనుమానంతో దాడి చేసిన ఓ యువకుడు, ఆపై భవనం పైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. కత్తిపోట్లకు గురైన యువతి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
అనుమానంతో మెుదలైన ఘోరం..
న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన చిన్నారావు (22), మహాలక్ష్మి (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల కాలంలో మహాలక్ష్మిపై చిన్నారావుకు తీవ్ర అనుమానం పెరిగింది. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో.. ఆవేశానికి లోనైన చిన్నారావు వెంట తెచ్చుకున్న కత్తితో మహాలక్ష్మి మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడని యువతి రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది.
ఒక్కసారిగా ఆత్మహత్య..
యువతిపై దాడి చేసిన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారావు, వెంటనే డాబా పైకి పురుగెత్తి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రక్తపు మడుగులో ఉన్న మహాలక్ష్మి గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె కూడా చికిత్స పొందుతూ కన్నుమూసింది.
పోలీసులు దర్యాప్తు..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో ఒకేసారి ఇద్దరు యువతీయువకులు బలికావడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు.
Also Read: విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే!