AP Rains: ఏపీని వర్షాలు పగబట్టాయి. పక్కనే గల తెలంగాణలో ఎండ తీవ్రత అధికంగా ఉంటే, ఏపీలో మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాలలో వర్షం కురుస్తుండగా, మరో నాలుగు రోజులు ఏపీలో దంచుడే దంచుడు అని వాతావరణ శాఖ ప్రకటించింది. అసలు ఇప్పుడు ఎక్కడ వర్షం కురుస్తోంది? రానున్న నాలుగు రోజుల్లో ఏయే జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందో తెలుసుకుందాం.
గజగజ వణికిన విజయవాడ
ఏపీలోని విజయవాడలో మాత్రం ఆదివారం వర్షం జోరు సాగింది. ఉదయం నుండి వాతావరణం చల్లగా ఉండగా, ఆ వాతావరణాన్ని నగరవాసులు ఆస్వాదించారు. అంతలోనే చిటపట చినుకులు మొదలై తీవ్ర వర్షాభావ పరిస్థితులు మొదలయ్యాయి. మొన్న వచ్చిన వరదలను తలపించేలా వర్షం జోరు సాగింది. ఓ వైపు ఉరుములు, మెరుపులు మరో వైపు గాలి వాన భీభత్సం సృష్టించాయి. దీనితో చిన్న వ్యాపారాలు నిర్వహించుకొనే వారు ఇబ్బందులు పడ్డారు.
9 గంటలకే నమోదైన వర్షపాతం వివరాలు
విజయవాడ నగరాన్ని వర్షం చుట్టుముట్టడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఉదయం 9 గంటలకు విజయవాడ ఈస్ట్ లో 23.4 మిల్లీ మీటర్లు, విజయవాడ నార్త్ లో 24.2, విజయవాడ సెంట్రల్ లో 24.6, విజయవాడ వెస్ట్ లో 24.6, ఇబ్రాహీంపట్నం 12.4, జి. కొండూరు 9.0, విజయవాడ రూరల్ లో 24.4, మైలవరం 4.8 వర్షపాతం నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ రోజు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే అనంతపురం, ఏలూరు, పలు జిల్లాలలో సైతం ఇదే పరిస్థితి కనిపించింది.
నాలుగు రోజులు వర్షాల జోరు..
ఏపీలో రానున్న నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కర్ణాటక, కోస్తా ఆంధ్ర,యానం, రాయలసీమ, తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ధ్రువీకరించారు.
Also Read: Ayushman Card: ఆయుష్మాన్ కార్డ్ పొందాలంటే ఏం చెయ్యాలి? ఎలా పొందాలి?
ఉమ్మడి కృష్ణాజిల్లా, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని, ఉరుములు, మెరుపులకు తోడు ఈదురు గాలులతో వర్షం కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో ఇంకా కల్లాల్లో, రోడ్లపై ధాన్యం ఆరబోసి ఉండడంతో వర్షాలకు తడిసిపోతాయని రైతులు అంటున్నారు. నాలుగు రోజుల్లో ఏడు శాతం వరకు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరి తస్మాత్ జాగ్రత్త.. రానున్న నాలుగు రోజులు ఏపీలో ఉరుములు, మెరుపులే.