Microplastics in Seafood: విశాఖ తీరంలోని చేపలు తింటున్నారా? అయితే అక్కడి చేపలపై ఇటీవల జరిపిన పరిశోధనలో ఓ విషయం వెలుగులోకి వచ్చిందట. సాక్షాత్తు ఓ అంతర్జాతీయ సంస్థ ఈ విషయాన్ని తెలపడంతో కాస్త కంగారు పడ్డారు స్థానికులు. ఇంతకు ఆ పరిశోధన ఏమి చెప్పింది? అసలు విషయం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
ఏంటా ప్రమాదం?
విశాఖపట్నం తీరంలో కొట్టుకొస్తున్న అలల్లో ప్రమాదం దాగుంది. మనం రోజు తింటున్న చేపలు, రొయ్యలు, పీతలు, అన్ని సముద్ర జీవాల్లో ఇప్పుడు మైక్రోప్లాస్టిక్‌లు కనిపిస్తున్నాయని తేలింది. ఇవి ఏవో తలపెట్టిన పెద్ద ప్లాస్టిక్ కవర్లు కాదు, మన కంటికి కనిపించని చిన్నచిన్న తుక్కులు. శరీరంలోకి వెళ్ళిపోయి నిశ్శబ్దంగా పనితీరును దెబ్బతీసే ప్లాస్టిక్‌లుగా తేలిందట. విశాఖ తీరంలో చేపల శరీర భాగాల్లో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయని తాజా అంతర్జాతీయ అధ్యయనం బహిర్గతం చేసింది. ఇవి మానవ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. మీరు తినే ఆ చేప ఇప్పుడు శరీరానికి పోషకమే కాదు.. ప్లాస్టిక్ పూత అని తెలుస్తోంది.
కాలుష్యమే కారణమా?
ప్రపంచవ్యాప్తంగా సముద్ర కాలుష్యం రోజురోజుకు పెరుగుతోందనేది అందరికీ తెలిసిన వాస్తవమే. అయితే అది మనకు ఎంత దగ్గరగా ఉందో తెలిస్తే నమ్మశక్యం కావడం లేదు. తాజాగా విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం చేపట్టిన అంతర్జాతీయ అధ్యయనం ఈ విషయం మీద బలమైన హెచ్చరికలు చేసింది. మనం రోజూ తినే చేపలు, రొయ్యలు, పీతలు ఇలా మత్స్యాహారంలో మైక్రోప్లాస్టిక్ అనే సూక్ష్మ ప్లాస్టిక్ తుణకులు ఉండటం, అవి మన శరీరంలోనికి ప్రవేశించడం ఇప్పుడు తీవ్రంగా ఆందోళన కలిగిస్తోన్న విషయంగా పరిశోధన తెలుపుతోంది.
పరిశోధన నిర్వహించింది వీరే!
ఈ అధ్యయనం యూరోపియన్ కమిషన్ ఆధ్వర్యంలోని ఎకోమెరైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్వహించబడింది. ఈ ప్రాజెక్టులో భారతదేశంతో పాటు జర్మనీ, స్పెయిన్, గ్రీస్, మలేషియా వంటి దేశాల పరిశోధకులు పాల్గొన్నారు. మన దేశం నుంచి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీతో పాటు కేరళ విశ్వవిద్యాలయం కూడా కీలకంగా ఈ పరిశోధనలో భాగమయ్యాయి. మొత్తం 15 రకాల మత్స్యజీవులను పరిశీలించగా, ప్రతి ఒక్కటిలోనూ మైక్రోప్లాస్టిక్ ధృవీకరణ జరిగింది.
విశాఖ తీర ప్రాంతం నుండి తీసుకున్న 100కి పైగా మత్స్య నమూనాలను విశ్లేషించగా, ప్రతి జీవిలోనూ మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా 120 మైక్రోమీటర్ల కన్నా చిన్న పరిమాణం కలిగిన సూక్ష్మ ప్లాస్టిక్ భాగాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్లాస్టిక్ ధాన్యాలు కేవలం జీర్ణ వ్యవస్థలోనే కాదు, కాలేయం, మూత్రపిండాలు, గోనాడ్‌లు వంటి కీలక శరీర భాగాల్లోనూ చేరినట్లు గుర్తించారు. అంటే మనం తినే చేపలు, రొయ్యలు కేవలం ప్రోటీన్ మాత్రం కాదు.. ప్రమాదకర ప్లాస్టిక్ కూడా!
శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రధాన మైక్రోప్లాస్టిక్ రకాలలో పాలిథిలిన్, పాలీప్రొఫైలిన్, నైలాన్, పీవీసీ, పాలీస్టైరిన్ ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఫిషింగ్ నెట్లు వంటి వాటి నుండి సముద్రాల్లోకి చేరతాయి. అంతేకాదు, పాలికార్బోనేట్, సింథటిక్ రబ్బరు వంటి పదార్థాలు కూడా ఈ సముద్ర జీవుల శరీరాల్లో ఉన్నట్లు గుర్తించారు.
ఈ ప్రాజెక్టులో విశాఖపట్నం వైపు పరిశోధనకు ప్రొఫెసర్ పి. జానకిరామ్, డాక్టర్ కె. ఉమాదేవి, ఎస్. గీత, డి. చంద్రశేఖర్ నాయకత్వం వహించారు. వీరి పరిశోధన ప్రకారం, తక్కువ ట్రాఫిక్ కలిగిన తీర ప్రాంతాలలో జీవులు మైక్రోప్లాస్టిక్‌ను ఆహారంగా తినే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు. చిన్న ఆల్గే, జూప్లాంక్టన్ మొదలుకుని చేపల వరకు మైక్రోప్లాస్టిక్‌లు సముద్ర ఆహార శృంఖలలోకి ప్రవేశిస్తున్నాయి. చివరికి మన మనిషి ప్లేట్‌లోకి చేరతాయి. అంటే మృదువుగా చెప్పాలంటే, మనమే మన ప్లాస్టిక్‌ను తిరిగి తింటున్నామని వారు తేల్చారు.
Also Read: Visakha Metro: విశాఖ మెట్రో సరికొత్త రికార్డు.. తెలుసుకుంటే కాలర్ ఎగరేస్తారు!
దీనివల్ల కలిగే భయంకర పరిణామాలు ఇవే?
శరీరంలో చేరిన మైక్రోప్లాస్టిక్‌లు తేలికగా బయటకు వెళ్లవు. అవి కణజాలాల్లో స్థిరపడతాయి, రోగ నిరోధక వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తాయి. కొన్ని ప్లాస్టిక్ పదార్థాలు హార్మోన్‌ల పనితీరును బ్లాక్ చేయడం, క్యాన్సర్‌లాంటి వ్యాధులకు కారణం కావడం, శ్వాస సంబంధిత ఇబ్బందులు కలిగించవచ్చని అధ్యయనం హెచ్చరిస్తోంది.
ప్రస్తుతం ఈ పరిశోధనల వివరాలు అన్ని భాగస్వామ్య ప్రయోగశాలల నుంచి ఏకీకృతంగా ఒక డేటాబేస్ రూపంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. దీన్ని పాలసీ మేకర్స్, వైద్య నిపుణులు, పర్యావరణ కార్యకర్తలు ఉపయోగించుకొనే అవకాశం ఉందట. అదే సమయంలో ప్రజలు తమ ఆహార ప్రవర్తనలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
మొత్తానికి చెప్పాలంటే, ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, ఇది ఆరోగ్య హక్కులపై ఉద్భవించిన నూతన సంక్షోభం. తీర ప్రాంతాల అభివృద్ధికి, చేపల వేట నియంత్రణకు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం తక్షణమే కార్యాచరణలోకి రావాల్సిన అవసరం స్పష్టంగా ఉందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. అలాగే ప్రతి మనిషి కూడా పర్యావరణంపై బాధ్యతతో వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని వారు అంటున్నారు. మొత్తం మీద ఈ విషయం సీరియస్ గా మారితే స్థానిక మత్స్యకారులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ పరిశోధన అసలు విషయాన్ని ప్రభుత్వం గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.