IT jobs Visakhapatnam: విశాఖ దశ దిశ మార్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. తాజాగా విశాఖ నగరానికి ప్రభుత్వ చొరవతో ఓ ప్రముఖ సంస్థ రాబోతోంది. దీనితో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కడమే కాక, విశాఖ నగరం పేరు దేశ వ్యాప్తంగా మారు మ్రోగనుంది. ఇక అసలు విషయం ఏమిటంటే..
విశాఖలో ఉద్యోగాలే.. ఉద్యోగాలు!
10వేల ఉద్యోగాలకు మార్గం వేస్తూ, విశాఖలో ANSR సంస్థతో భారీ ఒప్పందం కుదిరింది. గ్లోబల్ ఐటి రంగంలో విశాఖను కొత్త శకానికి నడిపించేందుకు ఏపీ ప్రభుత్వం తొలి అడుగు వేసింది. విశాఖపట్నం నగరం మరోసారి వార్తల్లోకి వచ్చింది. కారణం.. ANSR సంస్థతో కుదిరిన ఒక కీలక ఒప్పందం జరగడమే. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs) స్థాపనలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ANSR సంస్థ, విశాఖలో ప్రత్యేకమైన ఇన్నోవేషన్ క్యాంపస్ స్థాపించనుంది. ఇందులో మొదటి దశలోనే ఏకంగా 10వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
బెంగళూరులో జూలై 8న జరిగిన ఈ అవగాహన ఒప్పందం (MoU)పై మంత్రి నారా లోకేష్ సమక్షంలో సంతకాలు జరిగాయి. విశాఖ మధురవాడ ఐటి క్లస్టర్‌లో ఈ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకై ANSR భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఇది కేవలం ఉద్యోగాల విషయం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ను ఐటి రంగంలో గ్లోబల్ స్టేజ్‌పై నిలబెట్టే దిశగా మొదటి గంభీర అడుగు అని చెప్పొచ్చు.
ప్రపంచ స్థాయి లక్ష్యాలు
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రాబోయే నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో 20లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నదే మా లక్ష్యం. ఇందులో ఐటి, జిసిసి రంగాల్లో 5లక్షల ఉద్యోగాలు ఉండేలా చూస్తున్నాం. ఈ ప్రయాణం విశాఖ నుంచే మొదలవుతోందన్నారు. విశాఖను బెంగళూరు, గోవా లాంటి నగరాల మేళవింపుగా తీర్చిదిద్దాలన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో గ్లోబల్ ప్లేయర్లను ఆకర్షించడం తమ మొదటి విజయం కాగా, టిసిఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు ఇప్పటికే ఎకరా 99 పైసలకే భూములు కేటాయించడం కీలక నిర్ణయమని తెలిపారు.
Also Read: Godavari River: ఉదయం వస్తాడు.. రాత్రి వరకు కదలడు.. ఎవరైనా అటువైపు వెళితే..?
విశాఖకు గ్లోబల్ గ్లామర్
ఇప్పటికే విశాఖపై గ్లోబల్ కంపెనీలు దృష్టి పెట్టాయి. గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను ఇక్కడ నిర్మించబోతోంది. దీనితోపాటు దేశంలోనే అతిపెద్ద డాటా సిటీగా విశాఖ రూపుదిద్దుకోనుంది. ఇందులో హైపర్ స్కేల్ క్లౌడ్ సదుపాయాలు, ఎఐ ల్యాబ్‌లు, ఎనలిటిక్స్ హబ్‌లు, కంప్యూటింగ్ క్లస్టర్లు వంటి అనేక సాంకేతిక వనరులు ఏర్పాటు కానున్నాయి.
ANSR సీఈఓ లలిత్ అహూజా మాట్లాడుతూ.. విశాఖ మౌలిక సదుపాయాలు, ప్రతిభగల యువత, శక్తివంతమైన నాయకత్వం, ఇవన్నీ కలిసొచ్చిన ఘనతగా ఈ నగరాన్ని చూస్తున్నాం. మేము స్థాపించబోయే ఇన్నోవేషన్ క్యాంపస్ గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.
ఫలితాలు చూడండి – లోకేష్
ప్రకటనలకే పరిమితమైన పాలన కాదు, ఫలితాలపై శ్రద్ధ పెట్టే పాలనే మా విధానమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టిసిఎస్, కాగ్నిజెంట్ సంస్థల రాకతో ఐటి, జిసిసి రంగాల్లో 12 శాతం లక్ష్యం ఇప్పటికే నెరవేరిందని తెలిపారు. అమరావతి, తిరుపతి, అనంతపురం, కాకినాడ లాంటి నగరాల్లో స్మార్ట్ సిటీల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు.
భవిష్యత్తు వైపు దూసుకుపోతున్న విశాఖ
విశాఖను గ్లోబల్ జిసిసి రాజధానిగా మార్చే దిశగా ప్రభుత్వం స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఈ నగరానికి మెరుగైన గ్లోబల్ కనెక్టివిటీ కలుగనుంది. ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కావాలి అంటూ మంత్రి లోకేష్ వ్యాపార, ఐటి రంగాలకు పిలుపునిచ్చారు.
విశాఖలో ANSR జిసిసి ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుతో రాష్ట్రానికి వచ్చిన ఈ మంచి వార్త, ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాల రూపంలో కొత్త తలుపులు తెరుస్తోందని చెప్పవచ్చు. ఇది కేవలం ఓ ఒప్పందం కాదు, రాష్ట్ర భవిష్యత్తును మెరుగుపరిచే ఒక మైలురాయిగా ప్రభుత్వం భావిస్తోంది.