Protest at Karachi Bakery: పాకిస్తాన్ పై మన దేశీయులకు ఉన్న ఆగ్రహం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. అది ఎలా అంటే ఆ పేరెత్తితే రివేంజ్ రివేంజ్ అనే స్థాయిలో ఉన్నారనే చెప్పవచ్చు. అయితే పాకిస్తాన్ చేసిన దురాగతం కూడా అటువంటిదే. అమాయకులైన 26 మందిని పొట్టనబెట్టుకోవడంతో ఇటీవల మన దేశంలో ఆగ్రహజ్వాలలు రేగుతున్నాయి. ఆ కోపం పాకిస్తాన్ లో గల పేర్లు వాడినా సరే సహించమనే స్థాయికి వచ్చింది. తాజాగా ఏపీలోని విశాఖపట్టణంలో హై రేంజ్ నిరసన వ్యక్తమైంది. అసలు ఈ నిరసన ఎందుకు? ఎవరు చేశారో తెలుసుకుందాం.
కాశ్మీర్ కాల్పుల్లో విశాఖ వాసి మృతి
ఇటీవల కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడిలో మొత్తం 26 మంది మృతి చెందగా, వారిలో విశాఖకు చెందిన చంద్రమౌళి ఒకరు. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అయిన చంద్రమౌళి తన కుటుంబంతో కలిసి కాశ్మీర్ వెళ్లిన సమయంలో ఉగ్ర మూకలు కాల్పుల వర్షం కురిపించాయి. యావత్ దేశం మొత్తం ఈ దాడిని ఖండించింది. అంతేకాదు పాకిస్తాన్ మినహా ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో మన దేశానికి అండగా నిలిచాయి. విశాఖ వాసి ఉగ్రదాడిలో కన్నుమూయడంపై విశాఖ నగరవాసులు సంతాపం వ్యక్తం చేయడమే కాక, పాకిస్తాన్ అంతు చూడాలని నినదించారు.
విశాఖలో హై రేంజ్ నిరసన..
పాకిస్తాన్ పేరు ఎత్తితే ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తం సలసల మరిగిపోతోంది. వదలొద్దు పీఎం మోడీ జీ అంటూ ఎందరో నగరవాసులు ఇటీవల కేంద్రానికి మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా విశాఖకు వెళ్లి చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించారు. అయితే తాజాగా పాకిస్తాన్ పై ఉన్న ఆగ్రహజ్వాలలను నగరవాసులు మరోరూపంలో వ్యక్త పరిచారు.
అసలేం జరిగిందంటే..
విశాఖపట్నం – వెంకోజిపాలెంలో గల కరాచీ బేకరి ఎదుట జనజాగరణ సమితి ప్రతినిధులు చేరి ఆందోళన చేశారు. పాకిస్తాన్‌కు చెందిన కరాచీ పేరును పెట్టడం ఎంతవరకు సబబు అంటూ వారు ప్రశ్నించారు. తక్షణమే కరాచీ బేకరి పేరు మార్చాలని, లేదంటే కేంద్రం వీరిపై దేశ ద్రోహం కేసు పెట్టాలని జనజాగరణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. కరాచీ పేరును మార్చకపోతే, తమ ఆందోళన కొనసాగుతుందని వారు ప్రకటించారు.
Also Read: Naga Durga: నాగదుర్గ చించేశావ్.. కొరియోగ్రాఫర్స్ కళ్లు ఏమయ్యాయో?
కరాచీ..
పాకిస్తాన్ దేశంలో ప్రధాన నగరమే కరాచీ. మన శత్రుదేశంలోని నగరం పేరును ఎలా మనదేశంలో వాడుతారన్నదే ఇప్పుడు వీరి ప్రశ్న. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద కరాచీ బేకరీ యాజమాన్యం ఇలాంటి పరిస్థితుల్లో పేరు మార్చే దిశగా చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది మున్ముందు తెలిసే అవకాశం ఉంది.